దేశంలో కరోనా కారాళ నృత్యం చేస్తున్న వేళ మనం మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు ప్రధాని మోదీ. కొవిడ్-19తో పాటు ప్రధాన సవాల్ గా ముందుకొచ్చిన బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కరోనా మహమ్మారి సమసిపోయేవరకూ ఎవరూ నిర్లక్ష్యం గా ఉండరాదని సూచించారు.
కొవిడ్ పరిస్థితులపై తన పార్లమెంట్ నియోజకవర్గం వారణాసికి చెందిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఆయన ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కరోనా విస్తరిస్తున్న సమయంలో వారు చేస్తున్న ధైర్యసాహసోపేతమైన కృషిని అభినందించారు. ఈ సందర్బంగా వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. నిన్నమొన్నటి వరకు మన చుట్టు పక్కనే ఉన్న చాలా మందిని కోవిడ్ బలి తీసుకుందన్న ప్రధాని, వారి కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసారు. కరోనా ముప్పు నుంచి చిన్నారులను రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా సెకండ్ వేవ్‌ను కట్టడి చేయడంలో వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు ఎంతగానో కృషి చేస్తున్నారని అన్నారు. కాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,59,591 కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 4,209 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతానికి దేశంలో 30,27,925 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక దేశ వ్యాప్తంగా 14,82,754 మందికి వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. మన దేశంలో యాక్టివ్ కేసులు 11.63 శాతం కాగా, మరణాల శాతం మాత్రం 1.12 శాతం.