భారతీయ సంగీత దిగ్గజం, లెజెండరీ గాయని ఆశా భోంస్లే (92) ఆదివారం ముంబైలో కన్నుమూశారు. ఆమె మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆశా భోంస్లే మరణం తనను ఎంతగానో కలచివేసిందని, ఆమె అద్భుతమైన స్వరప్రస్థానం దశాబ్దాల పాటు భారతీయ సంస్కృతిని సుసంపన్నం చేసిందని కొనియాడారు. ఆమె పాడిన మధుర గీతాలు కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని ప్రధాని పేర్కొన్నారు. ఆశాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఆమె కుటుంబ సభ్యులకు మరియు అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఒక శకం ముగిసిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆమెకు నివాళులర్పించారు.