ఆ విషయంలో ఇండియాను చైనాతో పోల్చవద్దు: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా, చైనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  22 Dec 2023 11:27 AM IST
pm modi,  china, india, comparison,

 ఆ విషయంలో ఇండియాను చైనాతో పోల్చవద్దు: ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా, చైనా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక వృద్ధి విషయంలో భారత్‌ను పదే పదే చైనాతో పోలుస్తున్నారనీ.. అలా పోల్చడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యతిరేకించారు. ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ప్రధాని మోదీ ఈ కామెంట్స్ చేశారు. పొరుగు దేశం అయిన చైనా ప్రజాస్వామ్య దేశం కాదని చెప్పారు. అక్కడ నియంతృత్వ పాలన ఉందని విమర్శించారు. భారత్‌లో నిరుద్యోగం, అవినీతి, పాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల అంతరం ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు, ఆందోళనలు చేయడం కూడా సరికాదని మోదీ అన్నారు.

ఆర్థిక వృద్ధి గురించి మాట్లాడేటప్పుడు భారత్‌ను చైనాతో పోల్చవద్దని ప్రధాని మోదీ చెప్పారు. ఢిల్లీని ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోలిస్తే మరింత సముచితంగా ఉంటుందని చెప్పారు. మన పొరుగు దేశం చైనాలో ప్రజాస్వామ్య పాలన లేదని మోదీ అన్నారు. ఇక అవినీతి, నిరుద్యోగం వంటివి సవాళ్లే అని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ గుర్తింపు సాధించేది కాదని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచ స్థాయి కంపెనీల్లో మన దేశానికి చెందిన వ్యక్తులు ఉన్నతస్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. భారత్‌లో నైపుణ్యాల అంతరం లేదని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

మరోవైపు భారత్‌లోకి ఇతర దేశాలకు చెందిన కంపెనీలను ఆకర్షించించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉందని అన్నారు. పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను కల్పించి.. ఉద్యోగాలను సృష్టిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ క్రమంలోనే ప్రపంచస్థాయి కంపెనీలు భారత్‌లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశాలూ కల్పించినట్లు అవుతోందని వెల్లడించారు. భారత్‌లో మైనార్టీలను అణచివేస్తున్నారనే విమర్శలపై స్పందించి ప్రధాని.. విపక్ష నాయకులకు తమ అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఉంటుందని అన్నారు. అలాంటప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పి.. వాటిని ఖండించే హక్కు తమకూ ఉంటుందని ప్రధాని మోదీ ప్రతిపక్షాలవి ఆరోపణలే అని చెప్పారు.

Next Story