ప్ర‌ధానిగా రాలేదు.. మీ కుటుంబ స‌భ్యుడిగా వ‌చ్చా.. దేశానికి మీరే సుర‌క్షాక‌వ‌చం : మోదీ

PM Modi meets Soldiers in Nowshera on Diwali.దేశానికి సైన్యం సుర‌క్షా క‌వ‌చ‌మ‌ని.. వారి వల్లే ప్ర‌జ‌లంతా సుర‌క్షితంగా

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Nov 2021 1:40 PM IST
ప్ర‌ధానిగా రాలేదు.. మీ కుటుంబ స‌భ్యుడిగా వ‌చ్చా.. దేశానికి మీరే సుర‌క్షాక‌వ‌చం : మోదీ

దేశానికి సైన్యం సుర‌క్షా క‌వ‌చ‌మ‌ని.. వారి వల్లే ప్ర‌జ‌లంతా సుర‌క్షితంగా నిద్ర‌పోగ‌లుగుతున్నార‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం దీపావ‌ళి వేడుక‌ల‌ను సైనికుల‌తో క‌లిసి ప్ర‌ధాని మోదీ చేసుకుంటారు. అందులో బాగంగా నేడు జ‌మ్మూక‌ళ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్‌లో సైనికుల‌తో క‌లిసి మోదీ దీపావ‌ళి వేడుక‌ల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మాట్లాడుతూ.. తాను ప్ర‌ధానిగా రాలేద‌ని మీ కుటుంబ స‌భ్యుడినే వ‌చ్చాన‌ని అన్నారు. 130 మంది కోట్ల ప్ర‌జ‌లు ఆశీస్సులు తీసుకొచ్చాన‌ని చెప్పారు. సైనికుల మ‌ధ్య దీపావ‌ళి జ‌రుపుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. సైన్యం ధైర్యసాహసాలు దీపావళికి మరింత శోభను తీసుకువచ్చాయని కొనియాడారు.

ఇక‌.. సైన్యానికి అత్యాధునిక ఆయుధ సామగ్రి సమకూరుస్తున్నామని తెలిపారు. తేజస్‌, అర్జునలాంటి ఆయుధాలు అందుబాటులోకి వ‌చ్చాయ‌న్నారు. ఆయుధ సంపత్తితో సైనిక శక్తి నిరంతరం బలోపేతం చేస్తున్నట్లు వివ‌రించారు. ఆయుధాలను సమకూర్చుకోవడంలో స్వయం సంవృద్ధిని సాధిస్తున్నామ‌న్నారు. 200కిపైగా అత్యాధునిక ఆయుధాలను తయారు చేసుకున్నామ‌ని తెలిపారు. అన్నిరంగాల్లో మహిళలకు అవకాశాలు కల్పిస్తున్నామని.. ఇప్పటికే నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలు రాణిస్తున్నారని గుర్తు చేశారు.

సైన్యంలో మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. సైనిక పాఠశాలల్లో బాలికలకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ, మిలటరీ కాలేజీల్లోనూ మహిళలకు ప్రవేశం ఉంద‌న్నారు. జన్మభూమిని మించిన స్వర్గం లేదని ప్ర‌ధాని అన్నారు. సైన్యం కేవలం కేవలం సరిహద్దుల్లోనే కాపలా కాయడం లేదని.. రాష్ట్రాలకు కూడా సైన్యం రక్షణగా నిలుస్తుందన్నారు. అనంత‌రం సైనికులతో ఫోటోలు దిగి వారికి స్వీట్ల‌ను ప్ర‌ధాని మోదీ తినిపించారు.

Next Story