పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. ఇతర రాష్ట్రాల ఎన్నికలతో పోలిస్తే ఎంతో హాట్.. హాట్ గా సాగుతూ ఉన్నాయి. భారతప్రధాని నరేంద్ర మోదీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ఎప్పటికప్పుడు వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీని పశ్చిమ బెంగాల్ లో ధీటుగా అడ్డుకుంటామని ఆమె అంటూ ఉన్నారు. ఇక భారతప్రధాని నరేంద్ర మోదీని ఏకంగా డొనాల్డ్ ట్రంప్ తో పోల్చారు. ఎన్నికల్లో భద్రత నిమిత్తం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బలగాలు పశ్చిమ బెంగాల్ ఓటర్లను బెదరిస్తున్నాయని.. భారతీయ జనతా పార్టీకే ఓటు వేయాలని అంటున్నారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మూడవ దశ ఎన్నికల వేళ సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, ఐటీబీపీ బలగాలు అకృత్యాలకు దిగుతున్నాయని, వారి ఆగడాలపై తనకు 100కు పైగా ఫిర్యాదులు వచ్చాయని ఆమె ఆరోపించారు.
సెక్యూరిటీ సిబ్బంది పోలింగ్ బూత్ లను ఆక్రమించుకుని, రిగ్గింగ్ చేస్తున్నాయని.. బీజేపీ నేతలు నిర్వహించిన సభలకు ప్రజలు రాలేదని, దీంతో రాష్ట్రానికి రాలేక, ఢిల్లీలో కూర్చుని ఈ తరహా కుట్రకు తెరదీశారని విమర్శలు చేశారు. అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ఇటువంటి ఘోరాలను చేయలేదని, ట్రంప్ తో పోలిస్తే, నరేంద్ర మోదీ మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాల్లో ఎవరైనా వేధిస్తే, లోకల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు. బీజేపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా డబ్బును ఖర్చు పెడుతోందని ఆరోపించారు.