యుద్ద‌విమానాలు దిగే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ హైవేని ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

PM Modi inaugurates Purvanchal Expressway in Uttar Pradesh.యుద్ద విమానాలు అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ర‌హ‌దారుల‌పై

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Nov 2021 3:25 PM IST
యుద్ద‌విమానాలు దిగే పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌ హైవేని ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

యుద్ద విమానాలు అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ర‌హ‌దారుల‌పై దిగేందుకు వీలుగా జాతీయ ర‌హ‌దారుల‌ను రూపొందించ‌డంపై కేంద్రం దృష్టి సారించింది. ఈ నేప‌థ్యంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కొత్త‌గా నిర్మించిన‌ పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ హైవేని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం ప్రారంభించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే పొడ‌వు 340.8కిలోమీట‌ర్లు. దాదాపు రూ.22,500కోట్ల వ్య‌యంతో దీన్ని నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్‌వే లక్నోను ఘాజీపూర్‌తో కలుపుతుంది. దీంతో ఈ రెండు ప‌ట్ట‌ణాల మ‌ధ్య దూరం ఆరు గంట‌ల నుంచి మూడున్న‌ర గంట‌ల‌కు త‌గ్గ‌నుంది. ప్ర‌స్తుతం ఆరు లేన్లు ఉండ‌గా.. భ‌విష్య‌త్‌లో అవ‌స‌రం అయితే 8 లైన్ల‌కు విస్త‌రించుకునే వీలుంది.

ఈ హైవే పై యుద్ద విమానాలు అత్య‌వ‌స‌రంగా ల్యాండింగ్ చేసేందుకు వీలుగా 3.2 కిలోమీట‌ర్లు ఎయిర్ స్ట్రిప్‌ను నిర్మించారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మోదీ ఇండియ‌న్ ఆర్మీకి చెందిన సి-130జె సూప‌ర్ హెర్య్కుల‌ర్ విమానంలో ర‌హ‌దారిపై ఏర్పాటు చేసిన ఎయిర్ స్ట్రిప్‌పై దిగి చ‌రిత్ర సృష్టించారు. ఎయిర్‌స్ట్రిప్ వద్ద గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి స్వాగతం పలికారు. అక్క‌డ ఏర్పాటు చేసిన వైమానిక విన్యాసాల‌ను ప్ర‌ధాని తిల‌కించారు.

ఇక ర‌హ‌దారిని ప్రారంభించిన అనంత‌రం ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ.. పూర్వాంచల్ ప్రాంతవాసులకు ఈ ఎక్స్ ప్రెస్ హైవేను అందిస్తున్నందుకు ఆనందంగా ఉంద‌న్నారు. పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ హైవే ఉత్త‌ర ప్ర‌దేశ్‌కు గ‌ర్వ‌కార‌ణమ‌న్నారు. రాష్ట్రంలోని తూర్పు ప్రాంతంలో ఆర్థిక పురోగ‌తికి ఈ ర‌హ‌దారి ఎంతో దోహదం చేస్తుంద‌న్నారు.

Next Story