కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజ్యసభ పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఆయనకు వీడ్కోలు పలికే అశంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ఆజాద్ తనకు నిజమైన స్నేహితుడని చెబుతూ, భావోద్వేగానికి గురయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని కంటతడి పెట్టుకున్నారు. రాజ్యసభలో పదవీకాలం ముగుస్తున్న నేతలనుద్దేశించి ప్రసంగించిన మోదీ కాంగ్రెస్ నేత ఆజాద్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఉన్నత పదవులు వస్తాయి... పోతాయి కానీ ఆయన స్పందించిన తీరు తలుచుకుంటే కన్నీళ్లు ఆగవంటూ ఆజాద్‌కు సెల్యూట్ చేశారు ఈ సందర్భంగా మోదీ తన దుంఖాన్ని ఆపుకునే ప్రయత్నంలో మంచినీళ్లు తాగడం కోసం ఆగడంతో సభ చప్పట్లో మారుమోగింది.
2007లో కశ్మీర్ ఉగ్రదాడి సమయంలో గుజరాతీ పర్యాటకులు చిక్కుకున్నారని, ఆ సమయంలో ఆయన చేసిన మేలును మరిచిపోలేనని మోదీ వ్యాఖ్యానించారు. అనుక్షణం గుజరాతీ పర్యాటకులను యోగ క్షేమాలపై తనకు అప్‌డేట్ ఇచ్చారంటూ కన్నీరు పెట్టుకున్నారు. సొంత కుటుంబ సభ్యులకన్నా మిన్నగా స్పందించారంటూ ఆయన సహాయానికి సెల్యూట్ చేశారు. మీ పదవీ విరమణను అంగీకరించను. మీ సలహాలు తీసుకుంటూనే ఉంటాను. మా తలుపులు మీ కోసం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయని ఈ ఫిబ్రవరి 15 తో రాజ్యసభ పదవీకాలం ముగియనున్న ఆజాద్ నుద్దేశించి మోదీ వ్యాఖ్యలు చేశారు.
ఆజాద్ మాట్లాడుతూ.. తన సహచరులకు ధన్యవాదాలు తెలిపారు. జమ్మూకశ్మీర్ నుంచి ఢిల్లీ వరకు సాగిన తన ప్రస్థానాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఆజాద్ స్పందిస్తూ పార్టీ పరంగా విభేదాలున్నా..పలు విషయాలపై ఇరువురం పరస్పరం వాదించుకున్నా, విమర్శించుకున్నా, వ్యక్తిగత సంబంధాలను దెబ్బతీయలేదని వ్యాఖ్యానించారు. పండుగల సందర్భంగా తప్పనిసరిగా పలకరించే వారిలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మోదీ ఉంటారని గుర్తు చేసుకున్నారు. సభను ఎలా నడపాలనే విషయాన్ని మాజీ ప్రధాని వాజ్ పేయి నుంచి తాను నేర్చుకున్నానని చెప్పారు. సభలో ప్రతిష్టంభన నెలకొంటే, దాన్ని ఎలా తొలగించాలనే విషయాన్ని ఆయన నుంచే నేర్చుకున్నానని తెలిపారు. హిందుస్థాన్ కు చెందిన ముస్లింగా తాను ఎంతో గర్విస్తున్నానని ఆజాద్ చెప్పారు. తన జీవితంలో తాను ఒక్కసారి కూడా పాకిస్థాన్ కు వెళ్లలేదని, ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని చెప్పారు.