వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

PM Modi flags off Gandhinagar-Mumbai Vande Bharat Express.గుజ‌రాత్ రాష్ట్రంలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టిస్తున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 Sept 2022 2:42 PM IST
వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని

గుజ‌రాత్ రాష్ట్రంలో ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా గాంధీన‌గ‌ర్ క్యాపిట‌ల్ రైల్వే స్టేష‌న్‌లో వందే భారత్ రైలును జెండా ఊపి ప్ర‌ధాని ప్రారంభించారు. రైలును ప్రారంభించిన అనంత‌రం మోదీ రైలులో కొంత దూరం ప్ర‌యాణించారు. సౌక‌ర్య‌వంత‌మైన, మెరుగైన రైలు ప్ర‌యాణ అనుభ‌వంలో కొత్త శ‌కానికి నాంది ప‌లికే సెమీ-హైస్పీడ్ రైలు ఇది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్రల రాజ‌ధానుల‌ను క‌లుపుతూ గాంధీన‌గ‌ర్, ముంబైల మ‌ధ్య ఈ రైలు న‌డ‌వ‌నుంది.

వందే భారత్ రైలులోనే గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. రైలులోని వ‌స‌తుల‌ను ప‌రిశీలించారు. మోదీతో పాటు రైల్వే సిబ్బంది కుటుంబాలు, మ‌హిళా వ్యాపార‌వేత్త‌లు, యువ‌త ఈ రైలులో ప్ర‌యాణించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని వారితో ముచ్చ‌టించారు. ప్ర‌ధానితో వారు ఫోటోలు తీసుకున్నారు.

అక్టోబ‌ర్ 1 నుంచి గాంధీన‌గ‌ర్ నుంచి ముంబ‌యి మ‌ధ్య న‌డిచే ఈ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ క‌మ‌ర్షియ‌ల్ సేవ‌లు ప్రారంభం కానున్నాయి. ఒక్క ఆదివారం త‌ప్ప‌.. మిగిలిన ఆరు రోజులు ఈ రైలు న‌డ‌వ‌నుంది. ఈ రైలులో 16 కోచ్ లు ఉంటాయి. 1,128 మంది ప్రయాణికులు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. ఈ రైలు టికెట్ క‌నిష్ఠ ధ‌ర రూ.1,385 కాగా.. గ‌రిష్ఠ ధ‌ర రూ.2,505గా ఉంది. దేశంలో ఇది మూడో వందే భార‌త్ రైలు.

ఈ రైళ్లు విమానాల్లో మాదిరి అత్యాధునిక సౌకర్యాలతో ఉంటాయి. మెరుగైన ప్రయాణికుల భద్రతా ఫీచర్లు కూడా వందే భారత్ రైలు సొంతం. రెండు రైళ్లు ఢీకొనకుండా నిరోధించే కవచ్ టెక్నాలజీని ఇందులో అమర్చారు. 2019లో న్యూఢిల్లీ-వార‌ణాసి మార్గంలో తొలి వందే భార‌త్ రైలు అందుబాటులోకి వ‌చ్చింది. అనంత‌రం న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవీ మార్గంలో రెండో రైలును ప్ర‌వేశ‌పెట్టారు.

Next Story