దేశంలోని నిరుద్యోగులకు ప్రధాని నరేంద్ర మోదీ తీపి కబురు అందించారు. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని అధికారులకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు జారీ చేశారు. రానున్న ఏడాదిన్నరలో దేశంలో 10 లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలని పలు ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలకు సూచించారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం(పీఎంఓ) మంగళవారం ట్వీట్ చేసింది.
"దేశంలోని అన్ని విభాగాలు, మంత్రిత్వ శాఖల్లోని మానవ వనరుల గురించి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమీక్ష నిర్వహించారు. అలాగే.. ఏడాదిన్నరలో మిషన్ మోడ్ కింద 10 లక్షల మందిని వివిధ శాఖల్లో నియమించుకోవాలని సూచించారు. అని పీఎంఓ పోస్టు చేసింది.
దేశంలోని నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్ష పార్టీలు అన్ని ఇటీవల కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ రంగ సంస్థలో భారీగా ఖాళీలు ఉన్నాయని, నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ నియామకాలపై ఆయా శాఖలకు ప్రధాని మోదీ కీలక సూచన చేయడం గమనార్హం.