ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం అందించిన ఘనా

ఘనా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధానమంత్రి మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను అందించారు

By Knakam Karthik
Published on : 3 July 2025 8:23 AM IST

National News, Pm Modi, Abroad Tour, Ghana, Officer of the Order of the Star of Ghana

ప్రధాని మోదీకి అత్యున్నత పురస్కారం అందించిన ఘనా

భారత ప్రధాని మోదీ ఎనిమిది రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ఆఫ్రికా దేశమైన ఘనాలో పర్యటించారు. మొత్తం ఐదు దేశాల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం ఉదయం బయల్దేరి వెళ్లారు. కాగా గత 30 ఏళ్లలో భారత ప్రధాన మంత్రి ఘనాలో పర్యటించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఆ దేశ రాజధాని అక్రలోని విమానాశ్రయంలో దిగిన మోడీకి ఘనా అధ్యక్షుడు జాన్ డ్రామానీ మహామా ఘన స్వాగతం పలికారు. అనంతరం గార్డ్ హాఫ్ హానర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా భారత ప్రధానికి అరుదైన గౌరవం దక్కింది.

ఈ సందర్భంగా ఘనా అధ్యక్షుడు జాన్ మహామా ప్రధానమంత్రి మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అయిన ‘ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనాను అందించారు. 1.4 బిలియన్ భారతీయుల తరఫున ఈ గౌరవాన్ని స్వీకరిస్తున్నట్లు మోదీ ప్రకటించారు. "ఈ గౌరవం నా వ్యక్తిగతమైనది కాదు. ఇది భారత యువత ఆశయాలకు, సంస్కృతికి, ఘానాతో ఉన్న బంధానికి అంకితం" అని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ ద్వారా వెల్లడించారు.

ఏంటీ ఈ అవార్డు?

ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా అనేది ఘనా యొక్క రెండవ అత్యున్నత జాతీయ గౌరవం, దీనిని 1960లో అధ్యక్షుడు క్వామే న్క్రుమా స్థాపించారు. ఇది దౌత్యం, పాలన లేదా అభివృద్ధిలో విశిష్ట సేవలను గుర్తిస్తుంది. ఘనా అధ్యక్షుడు ఇచ్చే ఈ అవార్డులో నక్షత్రం ఆకారంలో ఉన్న ఒక అవార్డు ఉంటుంది.

Next Story