అరేబియా సముద్రలో తలెత్తి, పశ్చిమ తీర ప్రాంత రాష్ట్రాలను కకావికలం చేసిన తౌక్తే తుపాను మిగిల్చిన నష్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పరిశీలించారు. తౌక్టే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు. తీర ప్రాంత జిల్లాలైన అమ్రెలి, భావ్‌నగర్, కేంద్రపాలిత ప్రాంతం డయ్యుల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. గిర్ సోమ్‌నాథ్, ఉనా, జఫరాబాద్‌లల్లో కూడా సర్వే కొనసాగింది. ఈ ఏరియల్ సర్వేలో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రుపానీ కూడా మోడీని అనుసరించారు.
అయిదు రాష్ట్రాలను గదగాడాలాడించిన తౌక్టే తుఫాన్ తీరాన్ని తాకిన సమయంలో 170 నుంచి 190 కిలోమీటర్ల మేర బలమైన ఈదురుగాలులు వీచాయి. మత్స్యకారుల పడవలు, వలలు ధ్వంసమయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు, వందలాది హెక్టార్లలో పంట ధ్వంసమైంది. ఉద్యానవన పంటలు వర్షపు నీటితో నిండిపోయాయి. రైతులు, మత్స్యకారులు పెద్ద ఎత్తున నష్టపోయారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండటంతో గత కొంత కాలంగా కరోనా మహమ్మారి ప్రభావంతో ఢిల్లీకే పరిమితమైన ప్రధాని నరేంద్ర మోదీ బయటకు వచ్చారు. ఏరియల్ సర్వే నిర్వహించారు. మ్యాప్‌లను, శాటిలైట్ ఇమేజ్‌లను పరిశీలించారు. సర్వే తరువాత అహ్మదాబాద్ చేరుకున్న ఆయన తుఫాను పై అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపే అవకాశం ఉంది.