మహిళలపై నేరాల్లో వేగంగా శిక్షలు అమలు కావాలి: ప్రధాని మోదీ
కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచార సంఘటన కలకలం రేపింది.
By Srikanth Gundamalla
కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆస్పత్రిలో వైద్యురాలిపై అత్యాచార సంఘటన కలకలం రేపింది. ఇప్పటికీ ఇంకా విచారణ పూర్తికాలేదు. నిందితులకు శిక్ష ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మహిళలపై దాడులపై కీలక కామెంట్స్ చేశారు. మహిళలపై నేాలు తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆడవారిపై, చిన్నారులపై జరిగే దాడులపై విచారణ త్వరగా పూర్తి చేసి శిక్షలు విధించాలని ఆయన పేర్కొన్నారు. శనివారం భారత్ మండపంలో జిల్లా న్యాయవ్యవస్థలపై జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన ఈ కామెంట్స్ చేశారు.
మహిళలకు భద్రత కల్పించేలా ఇప్పటికే దేశంలో చాలా చట్టాలు ఉన్నాయన్నారు ప్రధాని మోదీ. 2019లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు చట్టాన్ని పాస్ చేసినట్లు చెప్పారు. దీని కింద సాక్షులను రక్షించే కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. వీటిని తదుపరి మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే మహిళలపై నేరాల విషయంలో వేగంగా తీర్పులు వస్తాయని అభిప్రాయపడ్డారు. దేశంలో ఆడవారు, చిన్నారులపై జరుగుతున్న ఘోరాలను చూస్తే ఆందోళన కరంగా ఉందని ప్రదాని మోదీ అన్నారు. పదేళ్లలో తమ ప్రభుత్వం కేసుల విచారణలో జాప్యాన్ని తొలగించేందుకు వీలుగా తీసుకొన్న చర్యలను మోదీ వివరించారు.
కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. హత్యాచారం వంటి ఘటనల్లో శిక్షలు కఠినంగా ఉండేందుకు వీలుగా చట్టాలను మరింత బలోపేతం చేయాలని ప్రధాని మోదీ ని కోరారు. ఆ తర్వాత ప్రధాని నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఆసక్తికరంగా మారింది.