లాక్ డౌన్ ఆలోచన లేదని తేల్చేసిన మోదీ.. ఇక రాష్ట్రాల చేతుల్లోనే..!

PM Modi Chairs Meeting With Union Council Of Ministers. కేంద్రమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ నిర్వహించారు.మోదీ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు.

By Medi Samrat
Published on : 30 April 2021 11:33 AM

PM Modi

కేంద్రమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం భేటీ నిర్వహించారు. వర్చువల్‌ విధానం ద్వారా ప్రధాని ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా నియంత్రణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కంటైన్‌మెంట్‌ జోన్లను కొనసాగించాలని, దేశవ్యాప్తంగా కరోనా టెస్టులు పెంచాలని ఆదేశించారు. కోవిడ్‌ కట్టడికి చర్యలు, వ్యాక్సినేషన్‌ వంటి అంశాలపై చర్చించారు. ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌, కరోనా వ్యాక్సిన్, అత్యవసరమైన ఔషధాలు తదితర ముఖ్యమైన విషయాలపై మంత్రులతో, అధికారులతో అడిగి తెలిసి కనుక్కున్నారు మోదీ.

కరోనా నివారణకు ప్రస్తుతం కొనసాగుతున్న మార్గదర్శకాల గడువును పెంచుతూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు జారీ చేసిన అన్ని నిబంధనలు మే 31 వరకు అమల్లో ఉంటాయని.. మార్గదర్శకాలు అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తాయని తెలిపింది. 10 శాతం కంటే ఎక్కువ పాజిటివిటీ ఉన్న ప్రాంతాలు లేదా ఆసుపత్రుల్లో 60 శాతం కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా జిల్లాల్లో కఠిన కంటైన్‌మెంట్‌ నిబంధనలు అమలు చేయాలని ఆదేశించింది. విపత్తు నిర్వహణ చట్టం కింద చేపట్టాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలని సూచించింది. మే 25న కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ జారీ చేసిన అన్ని మార్గదర్శకాలను అమలు చేయాల్సిందేనని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా మే 2 నుండి లాక్ డౌన్ అమలు చేయవచ్చని ఊహాగానాలు వినిపించాయి. మోదీ వ్యాఖ్యలతోనూ, కేంద్ర హోంశాఖ ఉత్తర్వులతోనూ దేశవ్యాప్త లాక్ డౌన్ ఉండదని తేలిపోయింది. అయితే లాక్ డౌన్ ఉంచాలా.. వద్దా.. అనే నిర్ణయం రాష్ట్రాల చేతుల్లో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలులో ఉంది.


Next Story