సరిహద్దుల్లో పాక్ మళ్లీ కాల్పులు..పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
By Knakam Karthik
సరిహద్దుల్లో పాక్ మళ్లీ కాల్పులు..పరిస్థితిపై ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం
భారత్, పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విరమణ ఒప్పందం కుదిరిన కొద్ది గంటల్లోనే పాకిస్థాన్ దానిని ఉల్లంఘించిన నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని తన అధికారిక నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు పాల్గొన్నారు.
కాల్పుల విరమణ ఒప్పందం శనివారం ప్రకటించగా, అదే రోజు రాత్రి పాకిస్థాన్ ఒప్పంద నిబంధనలను ఉల్లంఘించిందని భారత్ ఆరోపించింది. ఈ ఉల్లంఘనలను పరిష్కరించడానికి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని, పరిస్థితిని తీవ్రంగా, బాధ్యతాయుతంగా ఎదుర్కోవాలని పాకిస్థాన్‌ను భారత్ కోరినట్లు సమాచారం. ఆపరేషన్ సిందూర్ అనంతరం పాకిస్థాన్.. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలపై డ్రోన్ దాడులకు పాల్పడింది. భారత రక్షణ వ్యవస్థలు ఈ డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నప్పటికీ, అణ్వస్త్ర దేశాలైన ఇరు దేశాల మధ్య ఘర్షణలు మరింత తీవ్రమవుతాయేమోనన్న భయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కొద్ది గంటల తర్వాత పరిస్థితి కొంత చల్లబడినప్పటికీ, సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు మాత్రం ఇంకా భయాందోళనలతోనే గడుపుతున్నారు.