పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం చెలరేగిన హింసపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు గవర్నర్ జగ్‌దీప్ ధన్‌కర్‌కు మోదీ ఫోన్ చేసి, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. రాష్ట్రంలో లూటీలు, హత్యలు జరుగుతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని గవర్నర్ ధన్‌కర్ తన ట్విట్టర్ లో తెలిపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు ఫోన్ చేశారని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. రాష్ట్రంలో హింస, విధ్వంసం, దహనకాండ, దోపిడీలు, హత్యలు జరిగినట్టుగా తను కూడా ప్రధాన మంత్రికి తెలిపానని పేర్కొన్నారు. శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు సంబంధితులు తక్షణం చర్యలు ప్రారంభించాలన్నారు.
శాసన సభ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడిన తర్వాత పశ్చిమ బెంగాల్‌లో హింసాకాండ ప్రారంభమైందని బీజేపీ ఆరోపించింది. ఈ హింసాకాండపై చర్యలు తీసుకోవాలని, సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బీజేపీ నేత గౌరవ్ భాటియా ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. టీఎంసీ కార్యకర్తలు తమ పార్టీకి చెందిన నలుగురిని హత్య చేశారని, ఈ హింసాకాండకు బాధ్యత అధికార పార్టీదేనని బీజేపీ ఆరోపించింది.