టికెట్‌ కొని మెట్రోలో ప్ర‌యాణించిన ప్ర‌ధాని మోదీ

PM Modi Buys Pune Metro Ticket For Inaugural Ride.పుణె న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మెట్రో రైలు సేవ‌లు అందుబాటులోకి వచ్చాయి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  6 March 2022 5:15 PM IST
టికెట్‌ కొని మెట్రోలో ప్ర‌యాణించిన ప్ర‌ధాని మోదీ

పుణె న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మెట్రో రైలు సేవ‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆదివారం గ‌ర్వారే స్టేష‌న్‌లో ప‌చ్చ‌జెండా ఊపి మెట్రో రైలు సేవ‌ల‌ను ప్రారంభించారు. అనంత‌రం ప్ర‌ధాని స్వ‌యంగా కియోస్క్ ద్వారా టికెట్‌ను కొనుగోలు చేశారు. అనంత‌రం గ‌ర్వారే స్టేష‌న్ నుంచి ఆనంద్‌న‌గ‌ర్ వ‌ర‌కు మెట్రోలో ప్ర‌యాణించారు. ఈ రెండు స్టేష‌న్ల మ‌ధ్య 5 కిలో మీట‌ర్ల దూరం ఉంటుంది. మెట్రోలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో పాటు దివ్యాంగ చిన్నారులు కూడా ప్ర‌యాణించారు.

విద్యార్థుల ప‌క్క‌న కూర్చున ప్ర‌ధాని మోదీ.. వారితో ముచ్చ‌టించారు. అంత‌క‌ముందు ప్ర‌ధాని గ‌ర్వారే స్టేష‌న్‌లో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించిన ఎగ్జిబిష‌న్‌ను సంద‌ర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ప్ర‌ధాని కార్యాల‌యం ట్వీట‌ర్‌లో పోస్ట్ చేసింది. 'పుణె ప్రజలకు మెట్రో ద్వారా అనుకూలమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుతుంది' అంటూ ట్వీట్‌ చేసింది.

32.2 కిలోమీటర్ల పుణె మెట్రో రైలు ప్రాజెక్టులో ప్రస్తుతం 12 కిలోమీటర్ల మేర నిర్మాణం పూరై అందుబాటులోకి వ‌చ్చింది. ఈ ప్రాజెక్టు వ్య‌యం రూ.11,400 కోట్లు. 2016 డిసెంబ‌ర్ 24న ప్ర‌ధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కాగా.. మెట్రో రైలు కార్య‌క్ర‌మానికి మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే దూరంగా ఉన్నారు.

Next Story