ఒక్కో రైతు ఖాతాలో రూ.2,000 జమ చేసిన ప్రధాని.!
దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు శుభవార్త. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు.
By Medi Samrat Published on 5 Oct 2024 9:19 AM GMTదేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు శుభవార్త. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 18వ విడతను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. దేశంలోని 9.4 కోట్ల మందికి పైగా రైతుల ఖాతాలకు ప్రభుత్వం డిబిటి ద్వారా 20 వేల కోట్ల రూపాయల మొత్తాన్ని బదిలీ చేసింది. వెబ్‌కాస్ట్ ద్వారా దాదాపు 2.5 కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చాలా కాలంగా దేశంలోని కోట్లాది మంది రైతులు ఈ పథకం 18వ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి నిరీక్షణ నేటితో ముగిసింది. 18వ విడత లబ్ధి పొందడంతో రైతులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోని చిన్న, సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో 2019లో భారత ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను ప్రారంభించింది. ప్రస్తుతం దేశంలోని కోట్లాది మంది రైతులు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనేది భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం. ఈ పథకం కింద దేశంలోని రెండు హెక్టార్లు లేదా అంతకంటే తక్కువ సాగు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులకు ప్రభుత్వం ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం అందజేస్తోంది.
దేశంలోని పేద రైతుల ఖాతాల్లో ప్రతి సంవత్సరం మూడు విడతల రూపంలో ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయం రూ.6 వేలు విడుదల చేస్తుంది. ఒక్కో విడత కింద రూ. 2,000 చొప్పున మొత్తం నాలుగు నెలల వ్యవధిలో రైతుల ఖాతాలకు పంపిస్తారు.
ఈ పథకం కింద ఇంకా ఈ-కేవైసీ, భూ రికార్డులు వెరిఫై చేసుకోని రైతుల ఖాతాల్లో 18వ విడత జమ కాలేదు. దీంతో పాటు పథకంలో దరఖాస్తు చేసుకునే సమయంలో తప్పుడు సమాచారం నమోదు చేసిన రైతులకు 18వ విడత లబ్ధి కూడా అందలేదు. పథకానికి సంబంధించి మీకు ఏదైనా ఫిర్యాదు లేదా సమస్య ఉంటే.. మీరు ఈ మెయిల్ ఐడి pmkisan-ict@gov.in ద్వారా సంప్రదించవచ్చు.
महाराष्ट्र के वाशिम की पावन धरती पर कृषि और बंजारा समाज से जुड़े कार्यक्रम का हिस्सा बनकर बेहद उत्साहित हूं। https://t.co/UdHJwrFhkf
— Narendra Modi (@narendramodi) October 5, 2024