ఒప్పందం ప్రకారమే ధాన్యం కొనుగోలు : కేంద్రమంత్రి పియూష్ గోయల్
Piyush Goyal clarifies on Telangana Paddy Procurement.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగతున్నాయి. తెలంగాణలో
By తోట వంశీ కుమార్ Published on 3 Dec 2021 9:53 AM GMTపార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగతున్నాయి. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం టీఆర్ఎస్ ఎంపీ కే.కేశవరావు రాజసభలో ధాన్యం (బాయిల్డ్ రైస్) కొనుగోలు అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించారు. ఎంపీ కేశవరావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి షీయూష్ గోయల్ సమాధానం ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వంతో ముందుగా చేసుకున్న ఒప్పందం(ఎంఓయూ) ప్రకారమే ధాన్యం కొనుగోలు చేస్తామని మరోసారి స్పష్టం చేశారు. వానాకాలం పంటను పూర్తిగా కొంటామని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌తోనూ ఈ విషయమై ఇప్పటికే మాట్లాడినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
ఒప్పందానికి తెలంగాణ కట్టుబడి ఉండాలన్నారు. తెలంగాణ అంచనాలకు, వాస్తవాలకు చాలా తేడా ఉంటోందన్నారు. ఖరీఫ్ సీజన్‌లో 50లక్షల టన్నులు ఇస్తామని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం కేవలం 32.66లక్షల టన్నులే ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంతో మొదట 24 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు ఒప్పందం కుదిరిందని.. తరువాత దాన్ని 44లక్షల టన్నులకు పెంచినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 27లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ తెలంగాణ నుంచి వచ్చిందని.. ఇంకా 17లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ రావాల్సి ఉందన్నారు. పెండింగ్‌లో ఉన్న బాయిల్డ్ రైస్ గురించి మాట్లాడకుండా.. భవిష్యత్ గురించి కేంద్రాన్ని ప్రశ్నించడం అర్థరహితమని తెలిపారు.
రాబోయే కాలంలో బాయిల్డ్ రైస్ కొనబోమని ముందుగానే చెప్పామన్నారు. ఈ విషయాన్ని ఎంవోయూలో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. అయినప్పటికీ ఈ అంశంపై పదే పదే ప్రశ్నిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తోందన్నారు. ధాన్యం సేకరణ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు.