కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకానికి పెట్టారు. మహా కుంభం వద్ద స్నానాలు చేస్తున్న మహిళల అభ్యంతరకర వీడియోలను పోస్ట్ చేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై యూపీ పోలీసులు యాక్షన్ లోకి దిగారు. రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు. మెటా నుండి సహాయం కూడా తీసుకుంటున్నారు.
మహిళల గోప్యత, గౌరవానికి భంగం కలిగిస్తూ కుంభ్‌లో స్నానం చేస్తున్న, బట్టలు మార్చుకునే వీడియోలను కొన్ని ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేస్తున్నారని సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ గుర్తించింది. ఫిబ్రవరి 17న, మహిళా యాత్రికుల అనుచిత వీడియోలను పోస్ట్ చేసినందుకు ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై కేసు నమోదైంది. ఇలా వీడియోలను రికార్డు చేయడం మహిళల గౌరవ మర్యాదలు, గోప్యతను ఉల్లంఘించడమేనని పోలీసులు తెలిపారు. కొత్వాలి కుంభమేళా పోలీస్ స్టేషన్‌లో రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసినట్టు, చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్టు పోలీసులు వెల్లడించారు. వీడియోలను అప్లోడ్ చేస్తున్న ఆ ఖాతాలకు సంబంధించిన సాంకేతిక సమాచారం కోసం పోలీసులు ‘మెటా’ సాయాన్ని కోరారు. ఓ టెలిగ్రామ్ చానల్‌లో కూడా ఇలాంటి వీడియోలను అప్లోడ్ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరి 19న టెలీగ్రామ్ ఛానల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.