చిన్నారుల పైన, భారత్ లో కనిపిస్తున్న వేరియంట్‌పైనా కూడా తమ టీకా సమర్థవంతంగా పనిచేస్తోందని కేంద్ర ప్రభుత్వానికి ఫైజర్ సంస్థ తెలియజేసింది. అంతేకాదు, తమ వాక్సిన్ 2-8 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య కోల్డ్ స్టోరేజ్‌లో నెల రోజుల పాటు నిల్వచేయవచ్చని కూడా పేర్కొంది. టీకా అనుమతుల విషయంలో కేంద్రంతో గత కొంత కాలంగా సంప్రదింపులు జరుపుతున్న ఫైజర్.. జులై-అక్టోబరు మధ్య ఐదు కోట్ల డోస్‌లు సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది.
అయితే టీకాల వల్ల ఏవైనా నష్టాలు కలిగితే మాత్రం చట్టపరమైన చర్యలు లేకుండా చూడాలని కంపెనీ గట్టి పట్టు మీద ఉన్నది. ఇలాంటి ఇండెమ్నిటీ క్లాజ్ నే టీకాలు సరఫరా చేస్తున్న అన్ని దేశాల నుంచి ఫైజర్ రాబట్టుకుంది. మన దేశంలో ప్రస్తుతం కోవిషీల్డ్, కొవాగ్జిన్, రష్యా టీకా స్పుత్నిక్-వి టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే దేనికీ మనదేశం ఇలాంటి మినహాయింపు ఇవ్వలేదు. ప్రస్తుతం ఫైజర్ టీకాలు సరఫరా చేస్తున్న అమెరికా, యూరప్ దేశాలు పరిహార మినహాయింపు ఇచ్చాయి.
కాబట్టీ ఫైజర్ మన నుంచి కూడా ఇలాంటి హామీ కోరుకుంటోంది. ఫైజర్ ఇప్పటికే క్లినికల్ ట్రయల్స్ డేటా, టీకా సమర్ధత, వివిధ దేశాల ఆమోదం సహా కీలక సమాచారాన్ని కేంద్రానికి సమర్పించింది. ఎందుకంటే ఫైజర్ కేంద్ర ప్రభుత్వంతోనే నేరుగా ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్ల కోసం నేరుగా సంప్రదించగా తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వంతోనే ఒప్పందాలు చేసుకుంటామని స్పష్టం చేశాయి. మరోవైపు ఫైజర్ విషయంలో నిర్ణయం తొందరగా తీసుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.