పెట్రోల్‌ ధరలను తగ్గించిన నాలుగు రాష్ట్రాలు.. వెనక్కి తగ్గని కేంద్ర సర్కారు

Petrol Prices Decrease in Four States. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో నాలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.తమ వంతుగా వ్యాట్‌తో పాటు ఇతర పన్నులను తగ్గించి

By Medi Samrat  Published on  22 Feb 2021 12:02 PM IST
Petrol Prices Decrease in Four States

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మండిపోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో చమురు ధరలు రికార్డు స్థాయికి చేరాయి. రోజురోజుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరుగుతుండటంతో నాలుగు రాష్ట్రాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. తమ వంతుగా వ్యాట్‌తో పాటు ఇతర పన్నులను తగ్గించి ఈ పెట్రోల్‌ ధరల నుంచి వినియోగదారులకు కొంత ఊరట కల్పించాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఎన్నడు లేనంత స్థాయికి చేరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించం లేదు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ16 ఎక్సైజ్‌ డ్యూటీని పెంచిన విషయం తెలిసిందే. దానిని ఉపసంహరించుకోవడానికి నిరాకరిస్తుంది. దీంతో దేశంలో రోజురోజుకు పెరుగుతున్న చమురు ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధర రూ.100కు చేరువవుతుండటంతో రాజస్థాన్‌ ప్రభుత్వం స్పందించింది. దేశంలోనే మొదటిసారిగా జనవరి 29న 38 శాతంగా ఉన్న వ్యాట్‌ను 36 శాతానికి తగ్గించింది. దీంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. అసోం, మేఘాలయ, తాజాగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలు కూడా ఇదే దారిలో పయనించాయి.

అసోం ప్రభుత్వం గత ఏడాదిలో కోవిడ్‌-19పై పోరాడేందుకు నిధుల సేకరణ కోసం పెట్రోల్‌, డీజిల్‌పై రూ.5 ట్యాక్స్‌ విధించింది. అయితే చమురు ధరలు పెరుగుతుండటంతో ఆ ట్యాక్స్‌ను ఫిబ్రవరి 12న ఉపసంహరించుకుంది. దీంతో రాష్ట్రంలో కొంతమేర ధరలు తగ్గాయి. అదేవిధంగా మేఘాలయ ప్రభుత్వం కూడా భారీగా ధరలను తగ్గించింది. పెట్రోల్‌ డీజిల్‌పై రిబేట్‌ రూపంలో రూ.2లను తగ్గించగా, తర్వాత వ్యాట్‌ను పెట్రోల్‌పై 31.62 శాతం నుంచి 20 శాతానికి, డీజిల్‌పై 22.95 శాతం నుంచి 12 శాతానికి కుదించింది. దీంతో రాష్ట్రంలో లీటర్‌ పెట్రోల్‌పై రూ.7.40, డీజిల్‌పై రూ.7.10 తగ్గాయి. ఇక, చమురు ధరలను తగ్గించాలని పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది. ఇందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ను రూ.1 మేర తగ్గించింది. దీంతో పెట్రో ధరలపై కేంద్ర ప్రభుత్వం ధర్మసంకటంలో పడిపోయింది. ఇతర రాష్ట్రాలు తగ్గించినా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు.



Next Story