పెట్రోల్ -డీజిల్ ధరలు తగ్గబోతున్నాయా.. ఇదిగో క్లారిటీ..!
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలో ఇంధన ధరల తగ్గుదల ఉండబోతోందని ప్రచారం సాగింది.
By Medi Samrat Published on 3 Jan 2024 2:00 PM GMTలోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్వరలో ఇంధన ధరల తగ్గుదల ఉండబోతోందని ప్రచారం సాగింది. ఎన్నికల సందర్భంగా అధికార బీజేపీ ప్రభుత్వం పెట్రోల్-డీజిల్ ధరలను తగ్గించబోతోందని వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లారిటీ ఇచ్చారు. ఈ వార్తలో ఎలాంటి వాస్తవాలు లేవని.. ఇంధన ధరలు తగ్గించే ప్రసక్తే లేదని.. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనేదీ లేదని వివరించారు. ముడిచమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టపోయాయని తెలిపారు.
పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని గతంలో వచ్చిన వార్తలను తోసిపుచ్చారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. అలాంటి చర్య ఇప్పట్లో లేదని స్పష్టం చేశారు. ముడిచమురు మార్కెట్లలో అధిక అస్థిరత కారణంగా ఇంధన ధరల్లో ఎలాంటి కోత ఉండదని మంత్రి నొక్కిచెప్పారు. గత వారం ప్రారంభంలో, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలలో లీటరుకు సుమారు రూ. 8 భారీగా తగ్గించాలని అనుకుంటున్నారని పలు మీడియా సంస్థలు తెలిపాయి. గత ఏడాది ఏప్రిల్ 6 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు ఫ్రీజ్‌లో ఉన్నాయి. దేశ రాజధానిలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72 కాగా, డీజిల్ లీటరుకు రూ.89.62గా ఉంది. మే 22, 2022న, కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది.