సెంట్రల్ విస్టాపై వివాదం

Petition Against Central Vista. సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడవలప్‌మెంట్ ప్రాజెక్టుకు చెందిన నిర్మాణ కార్యక్రమాలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

By Medi Samrat  Published on  11 May 2021 11:20 AM GMT
central vista

కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని అనుకుంటూ ఉన్న సంగతి తెలిసిందే..! సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడవలప్‌మెంట్ ప్రాజెక్టుకు చెందిన నిర్మాణ కార్యక్రమాలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తూనే ఉన్నాయి. దేశం ప్రస్తుతం ఎంతో కష్ట సమయంలో ఉందని.. ఇలాంటి సమయంలో అంత డబ్బు ఖర్చు పెట్టి సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అవసరమా అనే విమర్శలు తీవ్రతరం అయ్యాయి. పలు రాజకీయ పార్టీలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. సరికొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనం నిర్మించనున్నారు. ఓ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్‌తో పాటు రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకూ మూడు కిలోమీటర్ల మేర ఉన్న రాజ్‌పథ్‌ను పునరుద్ధరిస్తారు. ప్రధానమంత్రి, ఉప రాష్ట్రపతుల కోసం కొత్త నివాసాలను నిర్మిస్తారు. కేంద్రం ఈ ప్రాజెక్టు పనులను ''అత్యవసర సేవల'' కిందికి తీసుకురావడంపై కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి.

సెంట్రల్ విస్టా ఎవెన్యూ రీడవలప్‌మెంట్ ప్రాజెక్టుకు చెందిన నిర్మాణ కార్యక్రమాలను నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై సమగ్ర విచారణను ఈనెల 17వ తేదీకి ఢిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. దేశంలో కరోనా ఉధృతంగా ఉన్న కారణంగా ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధారిటీ ఉత్తర్వులకు లోబడి సెంట్రల్ విస్టా కార్యక్రమాలను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. దీనిపై విచారణను 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ డీన్ పటేల్, జస్టిస్ జస్మీత్ సింగ్‌తో కూడిన బెంచ్ తెలిపింది.

పలువురు రాజకీయ నేతలు కూడా ఇందుకోసం పెడుతున్న ఖర్చును తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నివాసం నిర్మాణం కోసం పెట్టే ఖర్చును కొవిడ్-19 సంబంధిత వైద్య సాయం కోసం వినియోగించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ప్రియాంకా గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. ప్రధాని నివాసం, సెంట్రల్ విస్టా ఖరీదు రూ.20 వేల కోట్లనీ.. ఈ డబ్బులు వాడితే 62 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు వస్తాయని చెప్పారు. 22 కోట్ల రెమ్‌డెసివిర్ వయల్స్ కొనొచ్చని.. పదిలీటర్ల ఆక్సిజన్ సిలిండర్లు 3 కోట్లు కొనొచ్చని అంటున్నారు. 12 వేల బెడ్లతో మొత్తం 13 ఎయిమ్స్ ఆస్పత్రులైనా కట్టొచ్చని చెప్పుకొచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం వాటిపై దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఈ ప్రాజెక్టును తీవ్రంగా తప్పుబట్టారు.


Next Story