'నితీష్ జీ అలాగే ఉంటారు'.. జేడీయూ సీనియ‌ర్‌ నేత పోస్టుతో బీహార్‌లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు..!

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ వెల్లడయ్యాయి. బీహార్‌లో పూర్తి మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది.

By -  Medi Samrat
Published on : 14 Nov 2025 4:36 PM IST

నితీష్ జీ అలాగే ఉంటారు.. జేడీయూ సీనియ‌ర్‌ నేత పోస్టుతో బీహార్‌లో రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు..!

2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్ వెల్లడయ్యాయి. బీహార్‌లో పూర్తి మెజారిటీతో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మహాకూటమి ట్రెండ్స్‌లో చాలా వెనుకబడిపోయింది. వీటన్నింటి మధ్య సీఎం ఎవ‌ర‌నే విష‌య‌మై చర్చ మొదలైంది. జేడీయూ సీనియర్‌ నేత, మాజీ ఐఏఎస్‌ మనీష్‌ కుమార్‌ వర్మ ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్ట్‌ రాజకీయంగా సంచలనం సృష్టించింది.

మనీష్ కుమార్ వర్మ ఫేస్‌బుక్‌లో నితీష్ కుమార్ ఫోటోను షేర్ చేశారు. "నితీష్ జీ ఉన్నారు, నితీష్ జీ ఉంటారు, నితీష్ జీ అలాగే ఉంటారు!" అని రాశారు. ఇప్పుడు ఆయన పోస్ట్ కార‌ణంగా అనేక రాజకీయ అర్థాలతో ఊహాగానాలు వెలువ‌డుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వంలో నితీష్ కుమార్ సీఎం అవుతారని జేడీయూ స్పష్టం చేయడంపై చర్చ మొదలైంది.

నితీష్ కుమార్ లేని ఎన్డీయేలో మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే.. బీజేపీకి 92 సీట్లు, చిరాగ్ పాశ్వాన్ పార్టీకి 19 సీట్లు, జితన్ రామ్ మాంఝీకి 5 సీట్లు, ఉపేంద్ర కుష్వాహా పార్టీకి 4 సీట్లు వస్తున్నాయి. ఈ అన్ని పార్టీల సీట్లను కలిపితే మొత్తం సీట్ల సంఖ్య 120కి చేరుకుంది. ఇది బీహార్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 122 సీట్ల కంటే తక్కువ. అదే సమయంలో జేడీయూ ప్రస్తుతం 83 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

Next Story