రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే జేబు ఖాళీనే!

రైళ్లలో ప్రయాణించేటప్పుడు నిర్దేశించిన పరిమితిని మించి లగేజ్ తీసుకెళితే అందుకు సంబంధించి ప్రయాణికులు రుసుములు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభకు తెలియజేశారు

By -  Knakam Karthik
Published on : 18 Dec 2025 1:33 PM IST

National News, Delhi, Indian Railway, Passengers, luggage on trains

రైలు ప్రయాణం చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..లేదంటే జేబు ఖాళీనే!

ఢిల్లీ: రైళ్లలో ప్రయాణించేటప్పుడు నిర్దేశించిన పరిమితిని మించి లగేజ్ తీసుకెళితే అందుకు సంబంధించి ప్రయాణికులు రుసుములు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్‌సభకు తెలియజేశారు. విమానాశ్రయాలలో అనుసరిస్తున్న పద్ధతి తరహాలో రైలు ప్రయాణికులకు కూడా లగేజ్ నిబంధనలను అమలు చేస్తాయా? అని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘‘ప్రస్తుతం ప్రయాణికులు తమతో పాటు కంపార్ట్‌మెంట్‌లలోకి తీసుకువెళ్లే లగేజ్‌కు వారు ప్రయాణించే క్లాసుల వారీగా గరిష్ట పరిమితిని నిర్దేశించడం జరిగింది’’ అని అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు.

అలాగే క్లాసుల వారీగా ఉచిత పరిమితి, గరిష్ట పరిమితుల వివరాలను కూడా తెలియజేశారు. సెకండ్ క్లాస్‌లో ప్రయాణించే ప్రయాణికుడు 35 కిలోల సామానును ఉచితంగా, రుసుము చెల్లించి 70 కిలోల వరకు సామాను తీసుకువెళ్లడానికి అనుమతి ఉందని చెప్పారు.. స్లీపర్ క్లాస్ ప్రయాణికులకు ఉచిత పరిమితి 40 కిలోలు కాగా, గరిష్టంగా 80 కిలోల (రుసుము చెల్లించి) వరకు అనుమతి ఉందిని తెలిపారు.

ఏసీ 3 టైర్ లేదా చైర్ కార్‌లో ప్రయాణించే ప్రయాణికులకు 40 కిలోల ఉచిత పరిమితి అనుమతించబడుతుందని... అలాగే అదే గరిష్ట పరిమితి అని కూడా తెలియజేశారు. ఫస్ట్ క్లాస్/ ఏసీ 2 టైర్ ప్రయాణికులు 50 కిలోల సామానును ఉచితంగా, గరిష్టంగా 100 కిలోల వరకు (రుసుము చెల్లించి) తీసుకువెళ్లడానికి అనుమతి ఉంది. ఏసీ ఫస్ట్ క్లాస్ ప్రయాణికులు 70 కిలోల వరకు ఉచితంగా, గరిష్టంగా 150 కిలోల వరకు రుసుము చెల్లించి తీసుకువెళ్లవచ్చు. అయితే గరిష్ట పరిమితిలో ఉచిత పరిమితి కూడా కలిసి ఉంటుందని కూడా అశ్విని వైష్ణవ్ తన సమాధానంలో స్పష్టం చేశారు.

అయితే రుసుము చెల్లించి ప్రయాణించే క్లాసును బట్టి గరిష్ట పరిమితికి మించకుండా అదనపు లగేజ్‌ను ప్రయాణికులు వారితో పాటు బుక్ చేసుకుని తీసుకువెళ్లడానికి అనుమతి ఉందని తెలిపారు. అలాగే, 100 సెం.మీ x 60 సెం.మీ x 25 సెం.మీ (పొడవు x వెడల్పు x ఎత్తు) కొలతలు ఉన్న ట్రంకులు, సూట్‌కేసులు, పెట్టెలను వ్యక్తిగత సామానుగా ప్రయాణికుల కంపార్ట్‌మెంట్‌లలోకి తీసుకువెళ్లడానికి అనుమతి ఉందని పేర్కొన్నారు. ఈ కొలతకు మించి ఉన్న వస్తువులను ప్రయాణికుల కంపార్ట్‌మెంట్లలో కాకుండా, బ్రేకవాన్ (SLRలు)/ పార్శిల్ వ్యాన్‌లలో బుక్ చేసి తీసుకువెళ్లాలని చెప్పారు. వ్యాపార వస్తువులను వ్యక్తిగత సామానుగా కంపార్ట్‌మెంట్‌లో బుక్ చేయడానికి, తీసుకువెళ్లడానికి అనుమతి లేదని పేర్కొన్నారు.

Next Story