నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. బీఆర్ఎస్ కీలక నిర్ణయం
Parliament's Budget session from today.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి.
By తోట వంశీ కుమార్ Published on 31 Jan 2023 9:41 AM ISTపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు(జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి హోదాలో తొలిసారి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలిసారి. రేపు అనగా ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టనున్న చివరి బడ్జెట్ ఇదే కానుంది. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగేందుకు కృషి చేయాలని విపక్షాలకు ఇప్పటికే బీజేపీ విజ్ఞప్తి చేసింది. ఇక ఈ బడ్జెట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాను మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని చెప్పుకుంటున్న నిర్మలా సీతారామన్ ఈ సారైనా మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిస్తారో లేదో చూడాలి.
ఇదిలా ఉంటే.. బడ్జెట్ సమావేశాలు ఈ సారి రెండు దఫాల్లో జరగనున్నాయి. తొలి విడత నేటి నుంచి ఫిబ్రవరి 13 వరకు, రెండో విడత మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు జరగనున్నాయి. ఇక ఈ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు విపక్షాలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అదానీ – ఎల్ఐసీ, బీబీసీ- మోదీ డాక్యుమెంటరీ వివాదంపై సభలో చర్చించాల్సిందేనని ప్రతి పక్షాలు పట్టుబడుతుండగా, ఇందుకు ధీటుగా సమాధానం చెప్పేందుకు కేంద్రం సిద్దమైంది.
బీఆర్ఎస్ కీలక నిర్ణయం
నేటి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలను ఎడగట్టాలని, దేశవ్యాప్తంగా గవర్నర్ల తీరుపై పార్లమెంట్ సమావేశాల్లో గళం విప్పాలని ఆ పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. రాష్ట్ర ప్రమోజనాలపై ఎప్పటిలాగానే రాజీలేని పోరాటం చేయాలన్నారు.