సాంకేతికంగా ఎంతో ముందుకు దూసుకుపోతున్నప్పటికీ కొంత మందిలో ఇంకా మార్పు రావడం లేదు. మహిళల పట్ల మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. పెళ్లైన తరువాత వధువుకు కన్యత్వ పరీక్షను నిర్వహించగా అందులో విఫలమైందంటూ అత్తింటి వారు ఆమెను ఇంట్లోంచి గెంటివేశారు. అంతేకాకుండా పంచాయతీ నిర్వహించి అమ్మాయి కుటుంబ సభ్యులకు రూ.10లక్షల జరిమానా వేశారు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
భిల్వారా పట్టణానికి చెందిన 24 ఏళ్ల యువతికి మే 11న బాగోర్‌కు చెందిన ఓ యువకుడితో వివాహం జరిగింది. ఈ ప్రాంతంలో నూతన వధువుకు కన్యత్వ పరీక్ష నిర్వహించే దురాచారం నేటికి ఉంది. దీన్ని కుకుడీ అని పిలుస్తారు. కాగా.. పరీక్షలో వధువు విఫలమైంది. దీంతో అత్తింటి వారు అమ్మాయిని నిలదీశారు. పెళ్లికి ముందే ఆమె పొరుగింటిలో ఉండే ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది. ఇప్పటికే అతడిపై కేసు కూడా పెట్టినట్లు తెలిపింది. అత్యాచార విషయం తెలిసి ఆగ్రహించిన భర్త, అత్తమామలు ఆమెపై దాడి చేశారు.
అనంతరం పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. వధువు, ఆమె కుటుంబానికి పెద్దలు రూ.10లక్షల జరిమానా విధించారు. ఆ డబ్బులు చెల్లించనందుకు వధువును పుట్టింటికి పంపారు. వధువు కుటుంబం ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. భర్త, అత్త మామలతో పాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.