పాక్‌కు షాక్..భారత్‌లో ఎక్స్ అధికారిక ఖాతా నిలిపివేత

పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేశారు.

By Knakam Karthik
Published on : 24 April 2025 11:44 AM IST

National News, Jammu and Kashmir, India-Pakistan Relations,  Pahalgham Attack,Twitter Account Suspended

పాక్‌కు షాక్..భారత్‌లో ఎక్స్ అధికారిక ఖాతా నిలిపివేత

జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్‌లో భారత పర్యాటకులపై దాడితో పాక్‌ను టార్గెట్‌ చేసిన భారత్ కీలక చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ అకౌంట్‌ను భారత్‌లో నిలిపివేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం వెలువడింది. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై తీవ్రంగా స్పందించిన భారత్... దీని వెనుక పాకిస్థాన్ హస్తం ఉందని, సరిహద్దు ఉగ్రవాదాన్ని ఆ దేశం ప్రోత్సహిస్తోందని మండిపడింది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమయింది. పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలను తగ్గించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా ఇరు దేశాల్లోని రాయబార కార్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది సంఖ్యను తగ్గించనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 55 మంది సిబ్బందిని మే 1వ తేదీలోగా 30కి పరిమితం చేయాలని ఇరు దేశాలు అంగీకరించాయని విక్రమ్ మిస్రీ వివరించారు.

ఈ దౌత్యపరమైన చర్యలతో పాటు, డిజిటల్ మాధ్యమంలోనూ భారత్ తన నిరసనను వ్యక్తం చేసింది. పాకిస్థాన్ ప్రభుత్వ అధికారిక ఎక్స్ ఖాతాను భారత్‌లో అందుబాటులో లేకుండా నిలిపివేయడం ద్వారా, ఉగ్రవాద కార్యకలాపాలకు బాధ్యత వహించాలని పాక్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. పహల్గామ్ దాడి అనంతరం భారత్ తీసుకుంటున్న ఈ కఠిన నిర్ణయాలు ఇరు దేశాల మధ్య ఇప్పటికే దెబ్బతిన్న సంబంధాలను మరింత క్లిష్టతరంగా మార్చాయి.

Next Story