పాకిస్థాన్‌ను భారీ భూకంపం వణికించింది. గురువారం తెల్లవారుజామున బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 5.7గా నమోదు అయ్యింది. ఈ భూకంపం కారణంగా 20 మంది మరణించారు. తెల్లవారుజామున ప్రజలంతా గాఢనిద్రలో ఉండగా.. భూకంపం సంభవించడంతో ఏం జరిగిందో అర్థం కాలేదు. ఇళ్ల గోడలు, పై కప్పు కూలి నిద్రపోతున్న వారిపై పడిపోయాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందగా.. మరో 200 మందికిపైగా తీవ్రంగా గాయపడినట్లు బలూచిస్థాన్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అధికారి నసీర్ నాసర్ తెలిపారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులతో పాటు మహిళలు ఉన్నారన్నారు.
సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. అయితే.. భూకంపం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆరోగ్య కార్యకర్తలు టార్చ్‌లైట్ల సాయంతో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో భారీగా ప్రాణనష్టం ఉండే అవకాశం ఉందన్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. భూకంపం సంభవించిన ప్రాంతానికి రవాణా సదుపాయాలు సరిగ్గా లేకపోవడంతో.. సహాయక చర్యలు ఆలస్యం అవుతున్నాయి. భూ ప్రకంపనలతో క్వెట్టాలోని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.