భార‌త్‌కు పాక్ సాయం.. !

Pak aid to India.భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్ కూడా భార‌త్‌కు త‌న వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చింది.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  25 April 2021 6:04 AM GMT
Pakistan helps to India

భార‌త్‌లో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజులుగా.. నిత్యం 3లక్ష‌ల‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. దేశం క‌రోనా కోర‌ల్లో చిక్కి అల్లాడిపోతుంది. దీంతో భార‌త్‌కు సాయం అందించ‌డానికి ఇప్ప‌టికే ప‌లు దేశాలు ముందుకొస్తున్నాయి. ఇక పొరుగుదేశం పాకిస్థాన్ కూడా భార‌త్‌కు త‌న వంతు సాయం అందించేందుకు ముందుకు వ‌చ్చింది. త‌క్ష‌ణ సాయంగా వెంటిలేట‌ర్లు, డిజిట‌ల్ ఎక్స్ రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇత‌ర వైద్య సామాగ్రిని అందించేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు పాకిస్థాన్ దేశ విదేశాంగ శాఖ మంత్రి షా మ‌హ‌మ్మ‌ద్ ఖురేషి వెల్ల‌డించారు.

'క‌రోనా రెండోదశ విజృంభణపై పోరాటం చేస్తున్న భారత్‌‌కు సంఘీభావం తెలియజేస్తున్నాం.. ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగుదేశానికి మావంతు సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్‌ ఎక్స్‌రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామాగ్రి అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవి తక్షణమే భారత్‌కు అందేలా ఇరు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు కృషి చేయాలి. అంతేకాకుండా కరోనాపై పోరులో సాయానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలి' అని ఖురేషి ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే.. నిన్న‌ పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ కూడా దీనిపై స్పందించిన విష‌యం తెలిసిందే. భ‌యంక‌రమైన కొవిడ్-19తో పోరాడుతున్న భార‌త ప్ర‌జ‌ల‌కు త‌న‌ సంఘీభావం తెలుపుతున్నానని, కరోనాతో బాధ‌ప‌డుతున్న‌ భార‌త్‌తో పాటు ప్ర‌పంచ దేశాల‌ ప్ర‌జ‌లు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నామని ఆయ‌న ట్వీట్ చేశారు.

ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో దేశ వ్యాప్తంగా 17,19,588 టెస్టులు చేయ‌గా.. 3,49,691 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,69,60,172కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,767 మంది మృత్యువాత ప‌డ్డారు. దీంతో దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,92,311కి చేరింది. నిన్న 2,17,113 మంది కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1, 40,85,110 కి పెరిగింది. ప్ర‌స్తుతం దేశంలో 26,82,751 యాక్టివ్ కేసులు ఉన్నాయి


Next Story