దిశ రవి అరెస్టుపై ఇమ్రాన్ ఖాన్ పార్టీ ట్వీట్
Pak again meddles in India's affairs amid Disha Ravi row. భారత్‌లో సామాజిక కార్యకర్తల అరెస్ట్‌పై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
By Medi Samrat Published on 16 Feb 2021 5:24 PM ISTభారత్‌లో సామాజిక కార్యకర్తల అరెస్ట్‌పై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. 'సామాజిక ఉద్యమకారిణి దిశరవిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్రంలోని మోదీ, ఆర్‌ఎస్‌ఎస్ సర్కార్ పౌరులు హక్కులను కాలరాస్తోంది. కశ్మీర్ విభజనతో మైనార్టీలను తన గుప్పిట్లోకి తీసుకుంది. దేశంలో క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను తమకు అనుకూలంగా మలుచుకుంటోంది.' అంటూ ట్వీట్ చేసింది. ఇండియా హైజాక్ ట్విటర్ అనే హ్యాష్‌ట్యాగ్‌తో జతచేసింది. దిశరవికి తాము మద్దతు ప్రకటిస్తున్నామని పాక్ తెలిపింది.
గ్రెటా థన్ బర్గ్ టూల్ కిట్ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరుకు చెందిన విద్యార్థిని దిశా రవి, ముంబై లాయర్ నిఖితా జాకబ్, ఇంజనీర్ శంతనుల అరెస్టులు కూడా జరిగాయి. ఈ క్రమంలో దిశా రవి వ్యవహారంపై కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ట్విట్టర్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రపంచానికి భారత్ పీపీఈ (వ్యక్తిగత రక్షణ కవచాలు) కిట్లు అందిస్తుంటే.. కొందరు మాత్రం దేశప్రజలకు నష్టం కలిగించేలా టూల్ కిట్లు తయారు చేస్తున్నారంటూ మండిపడ్డారు. ''వయసే ప్రామాణికం అయితే.. 21 ఏళ్లకే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి పరమ వీర చక్ర పొందిన సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్ నే ఆదర్శంగా తీసుకుంటా. ఆ త్యాగాన్ని గర్వంగా ఫీలవుతా. అంతేకానీ, ఇలా టూల్ కిట్ తో చెడు ప్రచారం చేసే వారి పట్ల అస్సలు కాదు'' అని ఆయన అన్నారు.
భారత రిపబ్లిక్ డే సందర్భంగా రైతుల పరేడ్ లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ టూల్ కిట్ డాక్యుమెంట్ ను అంతర్జాతీయ పర్యావరణ వేత్త గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసినట్టు నిర్ధారణ అయింది. ఈ టూల్ కిట్ లో పేర్కొన్న అంశాలు ఖలిస్తాన్ వేర్పాటు వాద ఉద్యమానికి ఊతమిచ్చేలా ఉన్నాయని, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంక్షోభం తలెత్తేలా ఈ టూల్ కిట్ ను ఖలిస్తాన్ ఉద్యమ మద్దతుదారులు తయారు చేశారంటూ పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. బెంగళూరు అమ్మాయి దిశా రవి, ముంబయికి చెందిన నికితా జాకబ్, శంతనులే టూల్ కిట్ సృష్టికర్తలని పోలీసులు వెల్లడించారు. వీరు ఖలిస్తాన్ అనుకూల పొయెటిక్ జస్టిస్ ఫౌండేషన్ (పీఎఫ్ జే)తో కలిసి టూల్ కిట్ కు రూపకల్పన చేశారని, ఆ తర్వాత దాన్ని గ్రెటా థన్ బర్గ్ కు టెలిగ్రాం యాప్ ద్వారా పంపించారని ఢిల్లీ పోలీసులు వివరించారు.