ఇంతటి ఓటమిని ఊహించలేదు.. బీజేపీకి వారి భాషలోనే సమాధానం చెప్పాలి : చిదంబరం
మూడు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు
By Medi Samrat Published on 17 Dec 2023 5:30 PM ISTమూడు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం ఆందోళన వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని ప్రతిబింబించేలా కాంగ్రెస్ నాయకుడు చిదంబరం మాట్లాడారు.
వార్తా సంస్థ పీటీఐకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చిదంబరం మాట్లాడుతూ.. బీజేపీ ప్రతి ఎన్నికల్లో చివరిది అన్నట్లుగా పోరాడుతుందని.. దీనిని ప్రతిపక్ష పార్టీలు అర్థం చేసుకోవాలని అన్నారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు.. ఆ పార్టీకి పెద్ద బూస్ట్ అని చిదంబరం అన్నారు.
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో కాంగ్రెస్ ఇంతటి ఓటమిని ఎవరూ ఊహించలేదని చిదంబరం అన్నారు. ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయని, పార్టీ నాయకత్వం ఈ బలహీనతలను అధిగమిస్తుందనే నమ్మకం ఉందన్నారు. అయితే, నాలుగు పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి 40 శాతం ఓట్లు రావడం సంతోషించదగ్గ విషయమన్నారు.
ఎన్నికల ప్రచారం, బూత్ నిర్వహణ, నిష్క్రియ ఓటర్లను పోలింగ్ బూత్‌లకు తీసుకురావడం వంటి అంశాలపై దృష్టి సారించడం ద్వారా లోక్‌సభ ఎన్నికలకు పార్టీ ఓట్ల శాతం 45 శాతానికి పెరగవచ్చని చిదంబరం ఆశిస్తున్నట్లు చెప్పారు. బీజేపీ పోలరైజేషన్‌కు పాల్పడుతోందని ఆరోపించిన చిదంబరం.. ఇందుకు కాంగ్రెస్ తగిన సమాధానం చెబుతుందని.. బీజేపీకి వారి భాషలోనే సమాధానం చెప్పాలని అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని అంచనా వేస్తున్న సర్వేలపై చిదంబరం మాట్లాడుతూ.. గాలి బీజేపీకి అనుకూలంగా ఉందని.. అయితే గాలి దిశ మారుతుందని అన్నారు. బీజేపీ ఎన్నికలను ఎప్పుడూ తేలిగ్గా తీసుకోదు. అదే తన ఆఖరి పోరాటం అన్నట్లుగా పోరాడుతుంది. ప్రతిపక్షాలు ఆ పని చేయాలని సూచించారు.