AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారం నాడు లోక్‌సభ ఎన్నికల కోసం అన్నాడీఎంకేతో పొత్తును ప్రకటించారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వరకు ఇది కొనసాగుతుందని చెప్పారు. ఎఐఎడిఎంకె బీజేపీతో పొత్తుకు నిరాకరించిందని.. భవిష్యత్తులో పొత్తు పెట్టుకోకూడదని కట్టుబడి ఉంది. CAA, NPR & NRCని వ్యతిరేకిస్తామని కూడా హామీ ఇచ్చింది. అందువల్ల.. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ.. ఏఐఏడీఎంకేకు మద్దతు ఇస్తుందని.. అసెంబ్లీ ఎన్నికలకు కూడా మా పొత్తు కొనసాగుతుందని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
హైదరాబాద్ లోక్ సభకు అసదుద్దీన్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా బీజేపీ కొంపెల్ల మాధవీలతను నిలిపింది. హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బోగస్ ఓట్లు ఉన్నాయని మాధవీలత ఆరోపణలపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. హైదరాబాద్ లోక్ సభ పరిధిలో 6 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలను అసదుద్దీన్ ఖండించారు. ఓటరు జాబితా గురించి ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందని.. వీటిలో మన పాత్ర ఏమీ ఉండదన్నారు. బోగస్ ఓట్లు అంటే ఎన్నికల సంఘాన్ని అవమానించడమే అన్నారు. అలా మాట్లాడటం ద్వారా హైదరాబాద్ ప్రజలను కూడా అవమానిస్తున్నట్లేనని అసదుద్దీన్ అన్నారు.