భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ లో మరింత ముందుకు వెళుతూ ఉంది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. శనివారం ఒక్కరోజే 46.38 లక్షల మందికి వ్యాకినేషన్ చేయడం విషయం. శనివారం ఒక్కరోజే 21,18,682 మంది 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లకు మొదటి డోసు, 2,33,019 మందికి రెండో డోసు పంపిణీ చేసింది ప్రభుత్వం. దేశంలో ఇప్పటివరకు 40,44,67,526 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
అయితే ఇప్పటివరకూ దేశ జనాభాలో కేవలం దాదాపు ఆరు శాతం మంది ప్రజలకే రెండు డోసుల వ్యాక్సిన్ లభించింది. దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 40 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి 70 శాతం మంది ప్రజలకు టీకా వేయాలన్న లక్ష్యాన్ని అందుకోవాలంటే రోజూ 85 లక్షల నుంచి 90 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక డోసు వేసుకున్న వారు జనాభాలో 17 శాతం మంది వరకు ఉన్నారు. ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 135 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. త్వరలో వ్యాక్సిన్ల ఉత్పత్తి పెరిగేకొద్దీ దేశంలో వ్యాక్సిన్ వేయించుకునే వారి సంఖ్య పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.