మళ్లీ బాంబు బెదిరింపులు.. ఈ సారి ఏకంగా 20 విమానాలకు..
విమానాలకు బాంబు బెదిరింపుల ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి
By Medi Samrat Published on 19 Oct 2024 10:47 AM GMTవిమానాలకు బాంబు బెదిరింపుల ట్రెండ్ కొనసాగుతోంది. శనివారం భారతీయ విమానయాన సంస్థలకు చెందిన 20కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపులు భద్రతా ఏజెన్సీలలో భయాందోళనలను సృష్టించాయి. విమానాశ్రయంలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.
ఎయిర్ ఇండియా, ఇండిగో, ఆకాశ ఎయిర్, విస్తారా, స్పైస్ జెట్, స్టార్ ఎయిర్, అలయన్స్ ఎయిర్ విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. వీటిలో కొన్ని విమానాలను కూడా అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ముప్పులో ఉన్న విమానాలలో ఢిల్లీ, ముంబై నుండి ఇస్తాంబుల్‌కు ఇండిగో విమానాలు, జోధ్‌పూర్ నుండి ఢిల్లీకి విస్తారా విమానాలు ఉదయపూర్ నుండి ముంబైకి ఉన్నాయి.
దుబాయ్-జైపూర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం శనివారం తెల్లవారుజామున విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అయితే విచారణలో బాంబు బెదిరింపు బూటకమని తేలింది. విమానంలో మొత్తం 189 మంది ప్రయాణికులు ఉన్నారు. మరోవైపు ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న విస్తారా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీని తర్వాత విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు. తప్పనిసరి భద్రతా తనిఖీల తర్వాత విమానాన్ని లండన్‌కు బయలుదేరింది.
అక్టోబర్ 18న ఢిల్లీ నుంచి లండన్ వెళ్తున్న విమానంకు సోషల్ మీడియా ద్వారా బాంబు బెదిరింపు వచ్చిందని ఎయిర్ లైన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. దీంతో అధికారులకు సమాచారం అందించడంతో ముందుజాగ్రత్తగా విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించారు.
ఆకాసా ఎయిర్‌కి శుక్రవారం కూడా బాంబు బెదిరింపు వచ్చింది. శుక్రవారం బెంగళూరు నుంచి ముంబై వెళ్లే విమానానికి (క్యూపీ 1366) బెదిరింపు వచ్చిందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. భద్రతా ప్రోటోకాల్ ప్రకారం ప్రయాణీకులందరినీ విమానం నుండి దింపి తనిఖీ చేశారు. విమానయాన సంస్థ ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కూడా చెప్పింది. మరోవైపు ముంబై నుంచి ఉదయ్‌పూర్ వెళ్తున్న విస్తారా ఎయిర్‌లైన్స్ విమానానికి కూడా బెదిరింపు వచ్చింది. ముంబై విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
గత కొన్ని రోజులుగా సుమారు 40 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అయితే విచారణలో అవన్నీ నకిలీవని తేలింది. అయితే ఈ బెదిరింపుల కారణంగా విమానాన్ని దారి మళ్లించి రద్దు చేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.