కీవ్‌లో భారతీయులెవరూ లేరు.. ఒక్కరోజులో 1377 మంది స్వదేశానికి
Over 1300 Indians Evacuated in 24 hours says Centre.ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం 7వ రోజుకు చేరుకుంది.
By తోట వంశీ కుమార్ Published on 2 March 2022 6:52 AM GMTఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం 7వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను ఆక్రమించుకునేందుకు రష్యా దళాలు వేగంగా ముందుకు సాగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నా రష్యా వెనక్కి తగ్గడం లేదు. పలు నగరాల్లో ప్రవేశించి నాశనం చేస్తున్నాయి. కాగా.. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ప్రారంభించగానే అప్రమత్తమైన భారత ప్రభుత్వం.. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడానికి ఆపరేషన్ గంగ కార్యక్రమాన్ని చేపట్టింది.
గడిచిన 24 గంటల్లో ఉక్రెయిన్ నుంచి ఆరు విమానాలు భారత్‌కు చేరుకున్నాయని.. మొత్తం 1,337 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు.
#OperationGanga developments.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) March 2, 2022
Six flights have now departed for India in the last 24 hours. Includes the first flights from Poland.
Carried back 1377 more Indian nationals from Ukraine.
భారతీయ పౌరులందరూ కీవ్ నగరాన్ని వీడినట్లు విదేశాంగ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా తెలిపారు. మూడు రోజుల్లో మరో 26 విమానాల ద్వారా మిగిలిన వారిని స్వదేశానికి తీసుకురానున్నట్లు తెలిపారు.
మరో వైపు.. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను వెనక్కి తీసుకు వచ్చేందుకు భారత వైమానిక దళానికి (ఐఏఏఫ్) చెందిన విమానాలను రంగంలోకి దింపింది కేంద్రం. హిండాన్ ఎయిర్ బేస్ నుంచి రొమేనియా, హంగేరికి రెండు ఐఏఎఫ్ విమానాలు బుధవారం ఉదయం బయలుదేరి వెళ్లాయి. ఏసీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానం తెల్లవారుజామున 4 గంటలకు రొమేనియా బయలు దేరింది. ఇందులో ఉక్రెయిన్‌లో మానవ సహాయ చర్యలకు అవసరమైన సామగ్రిని పంపించారు. తిరుగుప్రయాణంలో ఈ విమానం 300 మందిని తీసుకురానుంది.
యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ తమ గగనతలాన్ని మూసివేసింది. దీంతో అక్కడ ఉన్న భారతీయులను స్వదేశానికి తరలించడం కొంత కష్టంగా మారింది. ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులను సరిహద్దు దేశాలైన పోలండ్, హంగరీ, రొమేనియా, స్లొవాక్ రిపబ్లిక్ దేశాల్లోని ఎయిర్ పోర్టులకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి భారత్‌కు తీసుకువస్తున్నారు.