తవాంగ్ ప్రాంతంలో దురాక్రమణకు దిగిన చైనాకు నరేంద్ర మోదీ ప్రభుత్వం రివార్డులిస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. శిక్షించడానికి బదులు రివార్డులు ఇస్తున్నారని.. చైనా దురాక్రమణలు, సరిహద్దు ఉద్రిక్తతలు పెరుగుతుంటే మోదీ ప్రభుత్వం మాత్రం అంతా సజావుగానే ఉందని చెబుతోందని అన్నారు. చైనా వస్తువుల కొనుగోళ్లను మనం పెంచుకుంటూ పోతున్నాం. ఎందుకు? ఒక్క 2020-21లోనే చైనా నుంచి మనం 65 బిలియన్ డాలర్ల వస్తువులను కొనుగోలు చేశాం. చైనా దురాక్రమణలు పెరుగుతుంటే, మనం ఆ తర్వాత సంవత్సరంలో 95 బిలియన్ డాలర్లు విలువచేసే వస్తువులు కొన్నామని అన్నారు.
దేశీయ ఉత్పత్తుల ధరలు రెట్టింపు ఉన్నా.. చైనా ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దని కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. మన సైనికులు దేశానికే గర్వకారణమన్నారు. వారి ధైర్యసాహసాలకు నమస్కరిస్తున్నాని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఘర్షణలో గాయపడ్డ సైనికులు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానన్నారు.