విపక్ష 'I-N-D-I-A' కూటమి తదుపరి 'భేటీ' ఆ నగరంలోనే.. తేదీలు కూడా 'ఫిక్స్‌'

Opposition INDIA Alliance Next Meeting In This City Clears Sanjay Raut Of Shivsena Dates Announced. పాట్నా, బెంగళూరు భేటీల‌ తర్వాత విపక్ష I-N-D-I-A కూటమి త‌దుప‌రి సమావేశం

By Medi Samrat  Published on  5 Aug 2023 10:31 AM GMT
విపక్ష I-N-D-I-A కూటమి తదుపరి భేటీ ఆ నగరంలోనే.. తేదీలు కూడా ఫిక్స్‌

పాట్నా, బెంగళూరు భేటీల‌ తర్వాత విపక్ష I-N-D-I-A కూటమి త‌దుప‌రి సమావేశం ముంబైలో జరుగుతుందని శివసేన నేత(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే), రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1 తేదీల్లో ఈ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశానికి స్వయంగా శివసేన యూబీటీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే అధ్యక్ష‌త వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) ఆతిథ్యం ఇస్తుందని రౌత్ చెప్పారు. ఈ రోజు తాను శరద్ పవార్, సుప్రియా సూలే, పృథ్వీరాజ్ చవాన్, నానా పటోలే, అశోక్ చవాన్‌లతో సహా పలువురు నేతలతో I-N-D-I-A కూటమి సమావేశం గురించి మాట్లాడినట్లు రౌత్ చెప్పారు.

జూన్‌లో పాట్నాలో I-N-D-I-A కూటమి తొలి సమావేశం జరగ్గా.. గత నెలలో బెంగళూరులో రెండో సమావేశం జరిగింది. త‌దుప‌రి భేటీలో కూటమి.. 2024 ఎన్నికల నేప‌థ్యంలో కమిటీల నిర్మాణాన్ని ప్రకటించవచ్చని భావిస్తున్నారు. విపక్షాల మధ్య మెరుగైన సమన్వయం కోసం.. త్వరలో జాయింట్ సెక్రటేరియట్‌ను కూడా ప్రకటించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీలో పార్టీలు ప్రత్యేకించి ప్రత్యక్ష ఎన్నికల పోరు ఉన్న రాష్ట్రాల్లో.. తమ విభేదాలను వీలైనంత వరకు తొలగించుకోవాలని భావిస్తున్నాయి.

బెంగళూరు సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రతిపక్ష సమూహం 'ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్' (I-N-D-I-A) పేరును ప్రకటించారు. సమన్వయం కోసం 11 మంది సభ్యులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని.. ముంబైలో జరిగే తదుపరి సమావేశంలో కో-ఆర్డినేటర్‌ను ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు.

విపక్ష కూటమిలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, ఆప్, జేడీయూ, ఆర్జేడీ, జేఎంఎం, ఎన్సీపీ (శరద్ పవార్), శివసేన (యూబీటీ), ఎస్పీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఆర్‌ఎల్‌డీ, ఎండీఎంకే, కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి (KMDK) ), VCK, RSP, CPI-ML (లిబరేషన్), ఫార్వర్డ్ బ్లాక్, IUML, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (మణి), అప్నా దళ్ (కామర్‌వాడి), మనితానేయ మక్కల్ కట్చి (MMK) ఉన్నాయి.

Next Story