భారత తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాట్లాడుతూ.. ఓటు వేసే వారు తమ విచక్షణను ఉపయోగించి ఓటు వేయాలని అభ్యర్థించారు, ఎందుకంటే ఈ ఎన్నికల ఫలితాలు.. దేశంలో ప్రజాస్వామ్యం ఉందో లేదో నిర్ణయిస్తాయని వ్యాఖ్యానించారు.
ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి, ఇవి దేశ ప్రజాస్వామ్యానికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. ఓటర్లందరూ తమ హృదయాలను వినాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది రహస్య బ్యాలెట్.. ఓటర్లు తమ విచక్షణను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు నన్ను ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నానని.. పార్లమెంటు వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సిన్హా అన్నారు.
మోదీ పాలనకు తీవ్ర విమర్శకుడైన సిన్హా.. అధికార పార్టీ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, అధికారంలో లేని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చివేస్తోందని ఆరోపించారు. తాను కేవలం రాజకీయ పోరాటం చేయడం లేదని తేల్చి చెప్పారు.
"నేను కేవలం రాజకీయ పోరాటమే కాదు.. ప్రభుత్వ సంస్థలపై కూడా పోరాటం చేస్తున్నాను. వారు చాలా శక్తివంతంగా మారారు. పార్టీలను విచ్ఛిన్నం చేస్తున్నారు, వారికే ఓటు వేయమని ప్రజలను బలవంతం చేస్తున్నారని యశ్వంత్ సిన్హా అన్నారు.