తమిళనాడు ఎన్నికల ముందు శశికళ జైలు నుండి విడుదలవ్వడం.. ఏకంగా అన్నాడీఎంకే పార్టీ నాదేనంటూ వ్యాఖ్యలు చేయడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే..! కానీ ఊహించని విధంగా ఆమె ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ ప్రకటించడం అంతకన్నా సంచలమైంది. ఇక శశికళ మద్దతు కోసం దినకరన్ కూడా ఓ వైపు ప్రయత్నాలు చేస్తూ ఉంటే.. మరో వైపు అన్నాడీఎంకే నేతలు కూడా శశికళ మద్దతు తమకేనని కొన్ని ప్రాంతాల్లో ప్రచారాల్లో భాగంగా చెబుతూ వెళుతున్నారు. అయితే అన్నాడీఎంకే కీలక నేత పన్నీర్ సెల్వం నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
ఎందుకంటే శశికళకు వ్యతిరేకంగా ఓ సమయంలో వేరు కుంపటి పెట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేసిన డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం.. ఆమె తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే తనకెటువంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. శశికళ తిరిగి అన్నాడీఎంకేలో వస్తానన్న ప్రతిపాదనలు వస్తే మాత్రం తప్పకుండా ఆలోచిస్తామని పన్నీర్ సెల్వం అన్నారు. అన్నాడీఎంకే వ్యక్తులపైన గానీ, కుటుంబాలపైన గానీ ఆధారపడదని.. శశికళపై తనకు ఎలాంటి కోపమూ లేదని, నిరాశ కూడా లేదని అన్నారు. శశికళ అన్నా, టీవీవీ దినకరన్ అన్నా తానెంతో గౌరవిస్తానని ఆయన అన్నారు. ఆమె తిరిగి రాజకీయాల్లోకి రావాలనుకుంటే తన ఇష్టమని, ఆ నిర్ణయం ఆమె మాత్రమే తీసుకోవాలని అన్నారు. తనకు, సీఎం పళని స్వామికి మధ్య ఎలాంటి విభేదాలూ లేవని, పళని స్వామే సీఎం అభ్యర్థిగా ఉండాలని ప్రతిపాదించిన వారిలో తానూ ఒకరినని అన్నారు. రాజకీయాల్లో రాజీలు పడటం సహజమన్నారు.