తెలుగు రాష్ట్రాలకు కేంద్ర బ్యాడ్ న్యూస్
Only 12 states tableaux allowed to republic day parade in Delhi.గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న
By M.S.R Published on 19 Jan 2022 2:32 PM ISTగణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే వేడుకల్లో తెలుగు రాష్ట్రాల శకటాలకు ఈ ఏడాది స్థానం దక్కలేదు. ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు మొత్తం 12 రాష్ట్రాలు, 9 శాఖలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే కవాతులో భాగం కానున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, జమ్మూ కశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మేఘాలయా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందిన శకటాలే రిపబ్లిక్ డే వేడుకల్లో కవాతు చేస్తాయని కేంద్ర రక్షణశాఖ తెలిపింది. చైనా, పాకిస్థాన్ దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్న అరుణాచల్ ప్రదేశ్, కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు పరేడ్‌లో చోటు దక్కింది. విద్య-నైపుణ్యాభివృద్ధి, పౌర విమానయానం, న్యాయశాఖ సహా మొత్తం 9 శాఖలకు చెందిన శకటాలు రిపబ్లిక్ డే ప్రదర్శనల్లో పాల్గొననున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన అమృతోత్సవాల థీమ్‌తో కూడిన అంశాలను ఈ శకటాలు ప్రదర్శించే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకకు మాత్రమే అనుమతి లభించింది.
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న కర్నాటక మినహా తక్కిన అన్ని రాష్ట్రాల ప్రచార శకటాలను రిపబ్లిక్ వేడుకల్లో ఊరేగించడానికి అనుమతి నిరాకరించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఏడాది రిపబ్లిక్ వేడుకల్లో కవాతు ప్రారంభమయ్యే సమయాన్ని ఉదయం 10 గంటలకు బదులు 10:30 గంటలకు మార్చినట్లు అధికారులు వెల్లడించారు. పొగ మంచు ప్రభావం ఎక్కువగా ఉండవచ్చని ఈ మార్పు చేశారు. గణతంత్ర ఉత్సవ శకటాలకు రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఈసారి మొత్తం 56 ప్రతిపాదనలు రాగా, అందులో 21 నమూనాలనే ఎంపిక చేశారు. విజయ్ చౌక్ నుంచి ఎర్రకోట వరకు ఈ శకటాల ప్రదర్శన సాగనుంది. కోవిడ్ కారణంగా ఈసారి గణతంత్ర వేడుకలకు పరేడ్‌కు కేవలం 4వేల మంది వీక్షకులను మాత్రమే అనుమతించే అవకాశాలున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. వరుసగా రెండవ సంవత్సరం కోవిడ్-19 సంక్షోభం మధ్య భారతదేశ గణతంత్ర దినోత్సవానికి విదేశీ ముఖ్య అతిథి రావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా మరోసారి కరోనా కేసుల సంఖ్య పెరగడం వలన విదేశీ అతిథులను భారత్ పిలవలేదు. గత సంవత్సరం, UK ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు, కానీ COVID-19 సంక్షోభం మధ్య ఆయన పాల్గొనలేకపోయారు. రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యే ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు ఇతర ప్రముఖులకు ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దీంతో అణువణువూ అధికారులు జల్లెడ పడుతూ ఉన్నారు.