ముగిసిన‌ వన్ నేషన్-వన్ ఎలక్షన్ కమిటీ మొదటి సమావేశం

ఒకే దేశం, ఒకే ఎన్నిక(వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్‌) కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన

By Medi Samrat  Published on  23 Sept 2023 2:38 PM IST
ముగిసిన‌ వన్ నేషన్-వన్ ఎలక్షన్ కమిటీ మొదటి సమావేశం

ఒకే దేశం, ఒకే ఎన్నిక(వ‌న్ నేష‌న్‌.. వ‌న్ ఎల‌క్ష‌న్‌) కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ తొలి సమావేశం ముగిసింది. ఢిల్లీలోని జోధ్‌పూర్ ఆఫీసర్స్ హాస్టల్‌లో జరిగిన ఈ సమావేశానికి చైర్మన్, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఇతర సభ్యులు హాజరయ్యారు. మాజీ రాష్ట్రపతి అధ్యక్షతన సెప్టెంబర్ 2న ఏర్పాటైన ఈ కమిటీలో హోంమంత్రి అమిత్ షా, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ సహా 8 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్‌వాల్‌ ప్రత్యేక సభ్యునిగా నియమితులయ్యారు. అయితే ఈ భేటీ ఫలితంపై ఇంకా సమాచారం వెల్లడి కాలేదు.

ప్రస్తుతం దేశంలో రాష్ట్ర అసెంబ్లీ స్థానాల‌కు, లోక్‌సభ స్థానాల‌కు ఎన్నికలు వేర్వేరు సమయాల్లో జరుగుతున్నాయి. వన్ నేషన్ - వన్ ఎలక్షన్ పేరుతో దేశవ్యాప్తంగా లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరపాల‌ని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం భావిస్తుంది. దీని వ‌ల్ల‌ ఓటర్లు తమ ఓటును ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ సభ్యులను ఎన్నుకోవడానికి ఉప‌యోగించుకోవ‌చ్చు.

స్వాతంత్య్రానంతరం, 1952, 1957, 1962, 1967లో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. అయితే 1968, 1969లో చాలా అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడ్డాయి. ఆ తర్వాత 1970లో లోక్‌సభ కూడా రద్దయింది. దీంతో ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనే సంప్రదాయానికి బ్రేక్ పడింది.

Next Story