గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ పట్టణంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. మరో ముగ్గురు కార్మికులు అదృశ్యమయ్యారు.
సచిన్ గుజరాత్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (జిఐడిసి) ప్రాంతంలో ఉన్న అనుపమ్ రసయాన్ ఇండియా లిమిటెడ్ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి 10.30 గంటల సమయంలో ప్రమాదకర రసాయనాలు నిల్వ ఉంచే కంటైనర్‌లో భారీ పేలుడు సంభవించిందని సూరత్ ఇన్‌ఛార్జ్ చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ పరీక్ తెలిపారు.
కొద్దిసేపటిలోనే మంటలు ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. సమాచారం అందుకున్న వెంటనే 15 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. దాదాపు రెండు గంటల పాటు శ్రమించి అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారని సచిన్ జిఐడిసి పోలీసు ఇన్‌స్పెక్టర్ డివి బల్దానియా తెలిపారు. మంటల్లో ఓ కార్మికుడు సజీవదహనం అయ్యాడన్నారు. మృతదేహాన్ని అర్థరాత్రి దాటిన తరువాత స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు గాయపడ్డారని, వారు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మరో ముగ్గురు కార్మికులు కనిపించకుండా పోయారన్నారు. వారికోసం ఫ్యాక్టరీ ఆవరణలో వెతుకుతున్నామన్నారు.