హర్యానాలోని ఫరీదాబాద్‌లో పత్రాలను చూపించాలని కోరిన ట్రాఫిక్ పోలీసుని కారులో లాక్కుని వెళ్లి తీసుకుపోయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వేగంగా వచ్చి వాహనంలో ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన బల్లభ్‌గఢ్ బస్టాప్ ప్రాంతంలో జరిగింది. శుక్రవారం సాయంత్రం డ్రైవర్ మద్యం మత్తులో ప్రయాణీకులను ఎక్కించుకోవడానికి రోడ్డు మధ్యలో తన కారును ఆపాడు. అయితే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడంతో ట్రాఫిక్ సబ్-ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ వద్దకు వచ్చి, అతని వాహన పత్రాలను అడిగాడు. చలాన్ వేయడానికి సిద్ధమయ్యాడు. ఈ తనిఖీ సమయంలో వివాదం పెద్దదిగా మారింది.
పేపర్‌లను పరిశీలించేందుకు సబ్‌ఇన్‌స్పెక్టర్ డ్రైవర్ డోర్ నుండి లోపలికి వంగగా, డ్రైవర్ ఒక్కసారిగా యాక్సిలరేటర్ మీద కాలు పెట్టాడు. వెంటనే వాహనం ముందుకు వెళ్ళిపోయింది. అతివేగంగా పోలీసు అధికారిని కొన్ని మీటర్లు ఈడ్చుకెళ్ళింది. అయితే ఇతర ట్రాఫిక్ సిబ్బంది, ప్రజలు వెంటనే వాహనాన్ని చుట్టుముట్టి అధికారిని రక్షించారు. డ్రైవర్‌ను గుర్తించిన పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.