గుజరాత్‌లోని ఓ ఆసుపత్రిలో వైద్యుడు ఎమర్జెన్సీ గదిలోకి ప్రవేశించే ముందు చెప్పులు తీసేయమని రోగి కుటుంబ సభ్యులను కోరినందుకు అతడిపై దాడి చేశారు. భావ్‌నగర్‌లోని సిహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళకు వైద్యులు చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆమె కుటుంబ సభ్యులు పరామర్శించడానికి ఆసుపత్రికి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది. దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఎమర్జెన్సీ రూమ్‌లోని సీసీటీవీలో మొత్తం ఘటన రికార్డు అయింది. ఆ వీడియోలో మంచంపై ఉన్న మహిళ పక్కన కొంతమంది పురుషులు నిలబడి ఉన్నారు. కొన్ని సెకన్ల తర్వాత డాక్టర్ జైదీప్‌సిన్హ్ గోహిల్ గదిలోకి ప్రవేశించారు. వైద్యుడు వారిని పాదరక్షలను తీసివేయమని కోరాడు. అయితే వైద్యుడి సూచనలు రోగి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. దీంతో నిందితులు డాక్టర్‌పై దాడికి తెగబడ్డారు. అతడిని కిందపడేసి మరీ కొట్టారు. మంచంపై పడుకున్న మహిళ, గదిలో ఉన్న నర్సింగ్ సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ నిందితులు వైద్యుడిని కొడుతూనే ఉన్నారు. ఈ ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలపై సంబంధిత సెక్షన్‌ల కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.