Odisha Mishap: రైల్వే సిబ్బంది ఫోన్లు సీబీఐ స్వాధీనం

జూన్ 2 సాయంత్రం ఒడిశా రాష్ట్రంలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు మరణించగా,

By అంజి  Published on  8 Jun 2023 8:30 AM IST
Odisha, triple train crash, CBI, Railway Staff

Odisha Mishap: రైల్వే సిబ్బంది ఫోన్లు సీబీఐ స్వాధీనం

జూన్ 2 సాయంత్రం ఒడిశా రాష్ట్రంలోని బహనాగ బజార్ రైల్వే స్టేషన్‌లో జరిగిన ట్రిపుల్ రైలు ప్రమాదంలో 288 మంది ప్రయాణికులు మరణించగా, 900 మందికి పైగా గాయపడ్డారు. కాగా ఈ రైలు ప్రమాదంపై సీబీఐ దర్యాప్తును ముమ్మరం చేసింది. డ్యూటీలో ఉన్న కొంతమంది రైల్వే సిబ్బంది మొబైల్ ఫోన్‌లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) బుధవారం స్వాధీనం చేసుకుంది. సెంట్రల్ ప్రోబ్ ఏజెన్సీ తన విచారణలో సిబ్బంది కాల్ డిటైల్ రికార్డ్స్ (CDRలు), వాట్సాప్ కాల్స్, సోషల్ మీడియా వినియోగాన్ని పరిశీలించనుంది.

అంతేకాకుండా భువనేశ్వర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లోకో పైలట్‌ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. బుధవారం బహనాగ బజార్ రైల్వే స్టేషన్‌ను ఫోరెన్సిక్, టెక్నికల్ టీమ్‌లతో కలిసి విచారణ సంస్థ 45 నిమిషాల పాటు సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. ఈ విషాద ఘటనపై విచారణను రైల్వే బోర్డు సీబీఐకి అప్పగించింది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు సీబీఐ విచారణ ప్రారంభించింది. సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలోని కొంతమంది సభ్యులతో పాటు 10 మంది సిబిఐ బృందం సంఘటనా స్థలానికి చేరుకుని ప్రధాన లైన్, లూప్ లైన్‌ను పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

బృందంలోని కొందరు సభ్యులు కూడా సిగ్నల్ రూమ్‌ను సందర్శించి అధికారులతో చర్చించారు. విధ్వంసం, కుట్ర జరిగిందన్న అనుమానాల నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశించింది. శుక్రవారం సాయంత్రం 2,500 మంది ప్రయాణికులతో వెళ్తున్న బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలిమార్‌-చెన్నై సెంట్రల్‌ కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రిపుల్‌ రైలు ప్రమాదంలో 288 మంది మృతి చెందినట్లు ఒడిశా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ కుమార్‌ జెనా తెలిపారు. ఈ ప్రమాదంలో 21 ప్యాసింజర్ కోచ్‌లు పట్టాలు తప్పడంతో పాటు తీవ్రంగా దెబ్బతిన్నాయి, వందలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన రోగులకు వారి సొంత రాష్ట్రాలకు ఒడిశా ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పిస్తోంది.

బుధవారం, రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బాధితుల మృతదేహాలను వివిధ మార్చురీల నుండి భువనేశ్వర్‌లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మార్చురీకి తరలించింది. మృతదేహాలను స్వీకరించేందుకు భువనేశ్వర్ రావాల్సిందిగా మృతుల కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇప్పటివరకు గుర్తించిన మృతుల సంఖ్య, మరణించిన వారి మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపడంపై ప్రభుత్వం తాజా ఇన్‌పుట్‌లను పంచుకోలేదు.

Next Story