సాధారణంగా ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఉన్న 34 గ్రామాలకు చెందిన దాదాపు 4 వేల మంది ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తారు. అది ఒక రాష్ట్రంలో కాదు.... రెండు రాష్ట్రాల్లో. ఓట్లు వేయడం కోసమే ఆంధ్రప్రదేశ్, ఒడిశా రెండూ రాష్ట్రాలు వీరికి పోటీ పడి ఓటు హక్కుతో పాటు అనేక పథకాలు అందిస్తున్నాయి. ఇక్కడ గిరిజనులకు రెండు రేషన్ కార్డులు, రెండు పింఛన్ కార్డులు, రెండు ఓటరు కార్డులు.. ఇలా అన్నీ రెండేసి ఉంటాయి. అలాగే రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను వీరు ఎన్నుకుంటారు.
తాజాగా తమకు చెందిన మూడు గ్రామ పంచాయతీల పేర్లను మార్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలను నిర్వహిస్తోందని సుప్రీంకోర్టులో ఒడిశా వేసిన పిటిషన్‌పై ఏపీ అఫిడ్‌విట్ దాఖలు చేసింది. తమ పంచాయతీలకు ఏపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహిస్తోందని ఆరోపిస్తూ.. ఒడిశా ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. జస్టిస్ ఎంఎం ఖాన్ విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఒడిశా పిటిషన్ పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయనగరం కలెక్టర్ అఫిడవిట్ దాఖలు చేశారు. కోటియా పరిధిలో ఉన్న 3 గ్రామాలు.. ఏపీకి చెందినవేనని ధర్మాసనానికి వివరణ ఇచ్చారు. మూడు గ్రామాల్లో గతంలోనూ ఎన్నికలు నిర్వహించినట్లు వివరించారు.
ఆ మూడు గ్రామాలు.. అరకు ఎంపీ, సాలూరు అసెంబ్లీ స్థానాల పరిధిలోని గంజీబాదర, పట్టుచెన్నూరు, పగ్లుచెన్నూరు.. ఒడిశా పిటిషన్ కొట్టివేయాలని ధర్మాసనాన్ని ప్రభుత్వం కోరింది. ఏపీ అఫిడవిట్ పై సమాధానానికి ఒడిశా ప్రభుత్వం 4 వారాల గడవు కోరింది. ఇరువరి వాదనలు విన్న ధర్మాసనం తదపురి విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.