ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ.. ఆయన ఎలా ఎదిగారంటే!!
ఆంధ్రప్రదేశ్ తర్వాత, ఒడిశాలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కార్యక్రమం చేశారు.
By M.S.R Published on 12 Jun 2024 9:45 PM ISTఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ.. ఆయన ఎలా ఎదిగారంటే!!
ఆంధ్రప్రదేశ్ తర్వాత, ఒడిశాలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కార్యక్రమం చేశారు. మోహన్ చరణ్ మాఝీ ప్రమాణ స్వీకారం చేశారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ మాఝీ మంగళవారం బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎంపికయ్యారు. కనక్ వర్ధన్ సింగ్ డియో, ప్రవతి పరిదా ఆయన డిప్యూటీలుగా ఉంటారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు.
53ఏళ్ల మోహన్ మాఝీ ఒడిశా మొదటి బీజేపీ ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మోహన్ చరణ్ మాఝీ బీజేపీ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. గత అసెంబ్లీ సమయం (2019-2024)లో BJP లెజిస్లేచర్ పార్టీ చీఫ్ విప్‌గా కూడా ఆయన పనిచేశారు. కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 147 స్థానాలకు గాను 78 సీట్లు గెలుచుకుని తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది. 2000, 2004లో బీజేడీ కూటమి భాగస్వామిగా బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉంది. ఓటమి ఎరగని నేతగా పేరున్న నవీన్ పట్నాయక్‌కు ఈసారి ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి. ఆ పార్టీ 51 స్థానాలకే పరిమితమవ్వడంతో ముఖ్యమంత్రి పదవి బీజేపీ వశమైంది.
మోహన్ చరణ్ మాఝీకి బలమైన RSS నేపథ్యం ఉంది. 40 సంవత్సరాలకు పైగా RSS తో అనుబంధం ఉంది. ఇక బలమైన నేతగా ఎదుగుతున్న సమయంలో 2021లో మోహన్ చరణ్ కారులో బాంబు పెట్టి హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఆ ప్రయత్నం విఫలం అయింది.1997 నుంచి 2000 వరకు సర్పంచ్‌గా ఉన్న మోహన్... అదే ఏడాది ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ ఆదివాసీ మోర్చా కార్యదర్శిగా పని చేశారు. 2019లో పార్టీ చీఫ్ విప్‌గా బాధ్యతలు చేపట్టారు. 2005 నుంచి 2009 వరకు బీజేపీ-బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ విప్‌గా పని చేశారు. ఆదివాసీ హక్కుల కోసం పోరాటాలు చేశారు.. మైనింగ్ మాఫియాకు వ్యతిరేకంగా ఉద్యమించిన మోహన్ చరణ్ మాఝీ ఒడిశా ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టారు.