పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాదుల శిబిరాలపై భారతదేశం లక్ష్యంగా చేసుకున్న దాడులకు ప్రతిస్పందనగా పాకిస్తాన్ కూడా కవ్వింపులకు దిగింది. పాకిస్థాన్ మీద దాడులను తీవ్రతరం చేసే ఉద్దేశ్యం భారత్ కు లేదని, కానీ దృఢంగా ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉందని భారతదేశం తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా భారతదేశం తీసుకున్న చర్యలను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ అనేక దేశాలకు వివరిస్తూ ప్రకటన జారీ చేశారు.
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతలు పెంచుకోవాలన్న ఉద్దేశం ఏ మాత్రం లేదని, అయితే పాకిస్థాన్ ఒకవేళ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడినా, వాటిని తిప్పికొట్టేందుకు ధీటుగా ప్రతీకారం తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ స్పష్టం చేశారు. అమెరికా, బ్రిటన్, సౌదీ అరేబియా, జపాన్ సహా పలు దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులతో అజిత్ దోవల్ ప్రత్యేకంగా మాట్లాడారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు జరిపిన కచ్చితత్వంతో కూడిన దాడుల గురించి, ఉద్రిక్తతలను మరింత పెంచకుండా ఉండేందుకు భారత్ తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద సంస్థల నిర్మూలనే లక్ష్యంగా, ఆ దేశంలోని సాధారణ పౌరులకు ఎలాంటి హానీ కలగకుండా ఈ దాడులను నిర్వహించామని అజిత్ దోవల్ స్పష్టం చేశారు.