టీచర్ రిక్రూట్ మెంట్ స్కాంలో అరెస్టయిన బెంగాల్ మాజీ మంత్రి పార్థ ఛటర్జీ, నటి అర్పిత ముఖర్జీ ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీలో ఉన్నారు. ఈడీ అధికారులు అర్పిత ముఖర్జీకి చెందిన రెండు ఫ్లాట్లలో తనిఖీలు చేయగా, రూ.50 కోట్ల వరకు నగదు పట్టుబడింది. ఆ డబ్బుతో తనకు సంబంధంలేదని పార్థ ఛటర్జీ అంటున్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు కుట్ర చేస్తున్నారో కాలమే జవాబు చెబుతుందని.. సమయం వచ్చినప్పుడు వాస్తవాలు ఏంటో అందరికీ తెలుస్తాయని పేర్కొన్నారు. తనను మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయడం నిష్పాక్షిక విచారణ కోసమేనని పార్థ ఛటర్జీ తెలిపారు.
తన ఫ్లాట్లలో దొరికిన డబ్బు పార్థ ఛటర్జీదేనని, ఆయన ఆ రెండు గదులకు తాళాలు వేసుకునేవారని.. కొందరు మనుషులను సెక్యూరిటీగా కూడా పెట్టారని అన్నారు. తనను కూడా ఆ గదుల్లోకి అనుమతించేవారు కాదని అర్పిత ముఖర్జీ చెప్పుకొచ్చింది. పార్థా ఛటర్జీ సన్నిహితురాలు అర్పిత ఇంట్లో ఈడీ అధికారులు దాదాపు రూ.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా.. అర్పితకు చెందిన రెండు లగ్జరీ కార్లు మిస్సయ్యాయి. కోల్‌కతాలో అర్పిత నివాసం ఉంటున్న డైమండ్ సిటీ కాంప్లెక్స్ నుంచి ఈ కార్లు ఎక్కడికో వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. వాటిలో భారీగా నగదు, ఇతర డాక్యుమెంట్లను తరలించి ఉండొచ్చని ఈడీ అనుమానిస్తోంది. వీరిద్దరి అరెస్టుకు ముందే అర్పిత కోసం పార్థా ఛటర్జీ రెండు లగ్జరీ కార్లు బుక్ చేసినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.